
- డిండి ప్రాజెక్ట్ కోసమే సీఎంను కలిశా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు : ‘మంత్రి పదవి ఇచ్చే అంశం సీఎం రేవంత్రెడ్డి చేతిలో లేదు. అది హైకమాండ్ పరిధిలో ఉంది, సీఎంను కలిసింది పదవి కోసం కాదు.. డిండి ప్రాజెక్టు కోసం’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎల్బీ నగర్నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ పాటు రేవంత్ రెడ్డి సైతం చెప్పారని.. అయినప్పటికీ మునుగోడు అభివృద్ధి కోసమే ఇక్కడి నుంచి పోటీ చేశానని చెప్పారు. కొన్నేండ్లుగా సాగు నీరు అందక మునుగోడు ప్రాంతం ఎడారిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడులో శివన్న గూడెం రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం పదేండ్లు కాలయాపన చేసిందే తప్ప పని పూర్తి చేయలేదన్నారు. డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడెంకు నీళ్లు వచ్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు కోరానని, నకిరేకల్ సభలో సైతం గుర్తు చేశానని చెప్పారు. దీనికి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని, వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని సీఎం చెప్పాకే… శాలువా కప్పానని స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి సీఎంను కలుస్తూనే ఉంటానన్నారు. మునుగోడు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.