Reading Time: 2 minutes
Virat Kohlis Message To Young Players No Excuses Keep Working Hard

Virat Kohli’s Message to Young Players: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్కులతో 139 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్‌ (110; 108 బంతుల్లో 13×4, 1×6) కూడా చెలరేగడంతో వెస్టిండీస్‌ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఘన విజయం అందించిన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం తన కెరీర్, ప్రస్తుత మానసిక స్థితి, యువ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన సలహాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నప్పటికీ.. తాను ప్రస్తుతం ఉన్న స్థితిని ఎంతో కృతజ్ఞతతో ఆస్వాదిస్తున్నానని కోహ్లీ చెప్పాడు.

‘నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా, కృతజ్ఞతగా అనిపిస్తుంది. ప్రపంచంలో పేరు, ప్రఖ్యాతి, అభిమానుల ప్రేమ, ఒత్తిళ్ల మధ్య మేము ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలనే కలతో మొదలైన నా ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. నేను ఎంత అదృష్టవంతుడినో అర్థమవుతుంది. భారత్ తరఫున ఆడడం గొప్ప గౌరవం. ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌లు ఆడటం, జట్టు కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తించడం నాకు ఎంతో ప్రత్యేకం. ఒకవేళ నేను భారత జట్టుకు ఆడే అవకాశం దక్కకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రస్తుతం దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఇలాంటి అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నందుకు నా హృదయం ఉప్పొంగుతోంది. బీసీసీఐ, అభిమానులకు నా కృతజ్ఞలు’ అని కింగ్ తెలిపాడు.

‘నా తల దించుకుని కష్టపడుతూ ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగాలనుకుంటున్నా. నా ఆటతో ఇతరుల ముఖాల్లో కూడా చిరునవ్వు తీసుకురావాలని కోరుకుంటున్నా. కెరీర్‌లో ఈ దశలో కూడా ఆటను ఆస్వాదిస్తూ, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా టార్గెట్. యువ క్రికెటర్లు మైదానం బయట జరిగే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. తాము ఎందుకు క్రికెట్ ఆడటం ప్రారంభించారో ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. యువ ఆటగాళ్లు గెలుపు కోసం తమ శక్తినంతా ఉపయోగించాలి. ఆటలో రిస్క్ తీసుకోవడం, సానుకూల దృక్పథంతో ఆడటం వల్లే విజయాలు వస్తాయి. మైదానంలోకి వెళ్లిన తర్వాత క్రికెట్‌నే అన్నింటికంటే ముఖ్యంగా భావించాలి. జట్టు కోసం మీ శరీరాన్ని కూడా పణంగా పెట్టి ఆడాలి. బ్యాటింగ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా ఎంత కష్టమైనా పరుగులు చేయాలి. మీరు 150 పరుగులు చేసినా కూడా ఒక ఓవర్‌లో అసవరం అయితే నాలుగు డబుల్స్ పరుగెత్తాలి. అవకాశం ఉంటె తప్పకుండా పరుగెత్తాలి. ఎలాంటి సాకులు చెప్పకూడదు’ అని యువ ఆటగాళ్లకు సందేశాన్ని ఇచ్చాడు.