
Lovely Professional University: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (LPU)లో రగిలిన నిరసన జ్వాలలు ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ విద్యార్థినిపై రేప్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో క్యాంపస్‌లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు హద్దులు దాటాయి. దీంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28 సోమవారం నుంచి ఏకంగా 10 రోజుల పాటు క్లాసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, జరగాల్సిన మిడ్-టర్మ్ పరీక్షలను కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వాయిదా వేసింది. కొత్త ఎగ్జామ్ షెడ్యూల్‌ను ‘యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (UMS) ద్వారా తెలియజేస్తామని చెప్పింది. అందరూ శాంతంగా ఉండాలని, విద్యార్థులు కావాలనుకుంటే తమ తల్లిదండ్రుల అనుమతితో సొంతూళ్లకు వెళ్లవచ్చని సూచించింది. క్యాంపస్‌లోనే ఉండిపోయే వారు మాత్రం హాస్టళ్లకే పరిమితం కావాలని, అనవసరంగా బయట తిరగొద్దని హెచ్చరించింది.
అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే..?
పంజాబ్‌లోని ఫగ్వారా సమీపంలో ఉన్న LPU క్యాంపస్‌లోని గర్ల్స్ హాస్టల్-3 వద్ద ఆదివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో నిరసనలు మొదలయ్యాయి. మూడు రోజుల క్రితం ఓ ప్లంబర్ ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయంపై హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన స్టూడెంట్స్ ఉదయం 8 గంటలకల్లా క్యాంపస్ బయట ఉన్న నేషనల్ హైవే-44ని దిగ్బంధించారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రానికి పోలీసులు రోడ్డు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా, ప్రొటెస్టర్లు వాటర్ బాటిళ్లు విసిరారు. దాంతో పోలీసులు లారీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆగ్రహించిన విద్యార్థులు క్యాంపస్ వైపు వెళ్లి పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు పోలీస్ వాహనాలు తగలబడిపోగా, మరో నాలుగు ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరి కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటడంతో కపూర్థలా, జలంధర్, హోషియార్‌పూర్ నుంచి భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఏడీజీపీ ఎం.ఎఫ్. ఫరూకీ స్వయంగా క్యాంపస్‌లోకి వెళ్లగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు.
ఈ అంశంపై పోలీసులు రంగంలోకి దిగి అజ్ఞాత వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలని చెబుతున్న విద్యార్థిని ఘటన తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది. నిజానిజాలు తేల్చేందుకు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, ఫొరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు డీఐజీ చెప్పారు. హాస్టల్ సిబ్బందిగా కేవలం మహిళలనే నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేయగా, దానికి యాజమాన్యం అంగీకరించింది. అలాగే, ఒక రెండు వారాల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని ఇక్కడే సూసైడ్ చేసుకుందని, అందులో కూడా ఏదో కోణం ఉందనే అనుమానాలను విద్యార్థులు లేవనెత్తడంతో.. దానిపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రేప్ ఆరోపణలను LPU యాజమాన్యం పూర్తిగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న పుకార్లని రిజిస్ట్రార్ మోనికా గులాటీ స్పష్టం చేశారు. హాస్టల్ రూమ్ నెంబర్ 504లో ఉండే ముగ్గురు అమ్మాయిల వీడియో స్టేట్‌మెంట్‌ను కూడా విడుదల చేశారు. అందులో ఆ విద్యార్థినులు తమ హాస్టల్‌లో ఎలాంటి రేప్ ఘటన జరగలేదని చెప్పారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేసిన యాజమాన్యం, ఫేక్ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
అయితే ఈ నిరసనల సమయంలో క్యాంపస్‌లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. కొందరు విద్యార్థులు అద్దాలు, పూల కుండీలు పగలగొట్టడం, ఏటీఎమ్ సెంటర్‌తో పాటు మాల్‌లోని షాపులను ధ్వంసం చేయడం, క్యాంపస్‌లో ప్రదర్శనకు ఉంచిన మిగ్-23 విమానం, మిలిటరీ ట్యాంక్‌లపైకి ఎక్కి రచ్చ చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. విసి జస్పాల్ సింగ్ సంధు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. LPU వ్యవస్థాపకుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ స్వయంగా వచ్చి తమకు హామీ ఇవ్వాలని, ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ప్రతినిధి ఎవరూ రాకపోవడం ఏంటని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రశ్నించారు. ఏది ఏమైనా, ప్రస్తుతం క్యాంపస్‌లో పోలీసు విచారణ కొనసాగుతోంది, విద్యార్థుల భద్రతే ముఖ్యమని యాజమాన్యం భావిస్తోంది.