July 15, 2026

Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!

Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!
Reading Time: 2 minutes
Rinku Singh Appointed Regional Sports Officer By Up Government After T20 World Cup Success

భారత క్రికెటర్ రింకూ సింగ్‌ మరో కొత్త పాత్రను చేపట్టనున్నాడు. రింకును ప్రాంతీయ క్రీడా అధికారిగా ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించబోతోంది. ఈ పరిపాలనా బాధ్యతల ద్వారా యూపీలో క్రీడల అభివృద్ధికి దోహదపడనున్నాడు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు లక్నోలో జరిగే ఓ కార్యక్రమంలో రింకుకు ఈ కొత్త బాధ్యతను అప్పగించనున్నారు. భారత్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేసినందుకు, ముఖ్యంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలవడంలో భాగస్వామి అయినందుకు యూపీ ప్రభుత్వం ఈ బాధ్యతను ఇస్తోంది.

వాస్తవానికి 2025 జనవరిలో క్రీడా కోటా కింద రింకు సింగ్‌ను ప్రాథమిక విద్యా శాఖ బీఎస్ఏగా నియమించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 ప్రత్యేక నిబంధనల కింద ఆయన ఎంపికను ప్రతిపాదించి.. అవసరమైన పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయమని సూచించారు. అయితే ఆ సమయంలో రింకు విద్యా అర్హతలకు సంబంధించి ఓ వివాదం తలెత్తడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం రింకుకు క్రీడా శాఖలో ఓ కొత్త పాత్రను కేటాయించి బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రింకు ఐపీఎల్ 2026 కోసం సిద్దమవుతున్నాడు.

క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా యూపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించింది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు బహుమతులు, ప్రతిష్టాత్మక అవార్డులు అందజేయనున్నారు. ఈ క్రమంలో మొత్తం ఆరుగురు అంతర్జాతీయ మెడల్ విజేతలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ ఆటగాడు రాజ్‌కుమార్ పాల్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించనున్నారు. అదే విధంగా పారాలింపిక్స్ హైజంప్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్‌కు కూడా డీఎస్పీ పదవి ఇవ్వనున్నారు. జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన అజిత్ సింగ్, 200 మీటర్ల బ్రాంజ్ మెడలిస్ట్ సిమ్రన్‌లకు జిల్లా పంచాయతీ రాజ్ అధికారి పదవులు ఇవ్వనున్నారు.

Also Read: IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!

అలాగే పారాలింపిక్స్‌లో 100మీ, 200మీ ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించిన ప్రీతిపాల్‌కు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో)గా నియామకం జరగనుంది. మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు నేటి సన్మాన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. 2024-25 సంవత్సరానికి గాను లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులతో తొమ్మిది మంది క్రీడాకారులను సత్కరించనున్నారు. ఈ అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ.3.11 లక్షల నగదు బహుమతి, కాంస్య ప్రతిమ ఇవ్వనున్నారు. అదనంగా 14 మంది క్రీడాకారులకు రూ.1.64 కోట్ల నగదు బహుమతులు, 19 మందికి ఎకలవ్య క్రీడా నిధి కింద రూ.8.75 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ నిర్ణయాలతో యూపీ ప్రభుత్వం క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తూ.. క్రీడా రంగ అభివృద్ధికి కీలక అడుగులు వేస్తోంది.