Reading Time: < 1 minute
దళిత యువతకు తెలంగాణ సర్కార్ తీపికబురు.. వాటిపై ఏకంగా 90 శాతం రాయితీ

సొంతంగా ఏదైనా ఉపాధి పొందాలని కలలుగనే దళిత యువతకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్సీ యువతకు భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టర్న్ డ్రీమ్స్ ఇన్ టూ డ్రైవ్ నినాదంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీని కింద రెండు రకాల వాహనాలను అందిస్తున్నారు.ఎలక్ట్రిక్ టూ-వీలర్లు,ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు.. 90 శాతం సబ్సిడీ తో అందించనున్నారు. ఈ పథకం మెయిన్ హైలెట్ ఏంటి అంటే.. సబ్సిడీ. ఎంపికైన లబ్ధిదారులకు వాహనం ధరలో 90 శాతం వరకు ప్రభుత్వమే సబ్సిడీ అందిస్తుంది. అంటే లబ్ధిదారులు కేవలం అతి తక్కువ మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు.

దరఖాస్తుదారులు తప్పనిసరిగా హైదరాబాద్ జిల్లాకు చెందినవారై ఉండాలి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్‌సైట్ https://tgobmms.cgg.gov.in లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ అవకాశం మార్చి 24, 2026 వరకు మాత్రమే. తక్కువ సమయంలోనే గడువు ముగియనుంది. అందుకే, అర్హులైన యువత వెంటనే స్పందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సూచించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Also Read: వేసవిలో ఉదయాన్నే ఒక కప్పు.. రోజంతా బాడీ కూల్.. కూల్..