Reading Time: 2 minutes
క్రికెట్‌ హిస్టరీలోనే అత్యంత పొడవైన నో బాల్.. కట్‌చే‌స్తే.. స్పాట్ ఫిక్సింగ్ బారిన మరో పాక్ బౌలర్..?

Pakistan T20I Cup Controversy: పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్‌లో జరిగిన మ్యాచ్‌లో అసాద్ అఖ్తర్ వేసిన ఓ నో-బాల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. కరాచీ బ్లూస్ తరపున లాహోర్ బ్లూస్‌పై ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఖ్తర్ ఒకే ఓవర్‌లో 21 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్‌లో రెండు వైడ్స్, రెండు నో-బాల్స్ ఉండటం గమనార్హం. అందులో ఒక నో-బాల్ అయితే మరీ విచిత్రంగా కనిపించింది. అతని ముందటి కాలు బౌలింగ్ క్రీజ్‌కు చాలా దూరంగా పడటంతో, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మొహమ్మద్ అమీర్ ఘటనతో పోలికలు..

ఈ నో-బాల్ పడిన వెంటనే 2010లో జరిగిన మొహమ్మద్ అమీర్ స్పాట్ ఫిక్సింగ్ ఘటనను గుర్తు చేసింది. ఆ సమయంలో ఇంగ్లాండ్‌పై లార్డ్స్ టెస్టులో అమీర్ వేసిన నో-బాల్ కూడా తర్వాత ఫిక్సింగ్ భాగంగా బయటపడింది. ఇప్పుడు అఖ్తర్ ఘటన కూడా అలాంటి అనుమానాలను రేకెత్తిస్తోంది.

అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ ఈ ఘటనపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2010 స్పాట్ ఫిక్సింగ్ స్కాం ఎలా బయటపడిందో వివరించాడు. లండన్‌లో ఉన్న తన స్నేహితుడు ఒక మొబైల్ ఫోన్ రిపేర్ చేస్తూ ఈ కుట్రను గుర్తించినట్లు చెప్పాడు.

ఆ ఫోన్‌లో మజ్హర్ మజీద్, ఆటగాళ్ల మధ్య జరిగిన మెసేజ్‌లు బయటపడ్డాయని, అందులో మ్యాచ్ ఫిక్సింగ్ ప్లాన్ వివరాలు ఉన్నాయని వెల్లడించాడు.

ఆఫ్రిది – అమీర్ ఘటన..

రజాక్ తెలిపిన ప్రకారం, ఆ విషయాన్ని వెంటనే కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి తెలియజేశాడు. ఆఫ్రిది, అప్పటికి కేవలం 18 ఏళ్ల వయసులో ఉన్న అమీర్‌ను తన గదికి పిలిపించి నిజం చెప్పమని అడిగాడు. మొదట అమీర్ నిరాకరించడంతో ఆఫ్రిది కోపంతో అతడిని చెంపదెబ్బ కొట్టినట్లు రజాక్ వెల్లడించాడు.

అసాద్ అఖ్తర్ వేసిన ఈ నో-బాల్ నిజంగా పొరపాటా? లేక మరేదైనా కారణమా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ గతంలో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఘటనల కారణంగా అభిమానులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..