Reading Time: < 1 minute
Telangana: తెలంగాణలో గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే.. రేవంత్ సర్కార్ సూపర్ న్యూస్..  ఈ రూట్లోనే..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజున గవర్నర్‌ శివ్‌ప్రతాప్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ పురోగతిలో ప్రతిపౌరుడు భాగస్వామి కావాలని, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ పాలన సాగుతోందన్నారు. 2047 తెలంగాణ రైజింగ్‌ దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతోందని తెలిపారు. కోర్, ప్యూర్, రేర్‌గా తెలంగాణను విభజించామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు చేపట్టినట్లు గవర్నర్ వివరించారు.

మూసీ ప్రక్షాళనకు శ్రీకారం

55 కిలోమీటర్ల మేర మూసీ నదిని పునరుజ్జీవింపచేస్తామని గవర్నర్ తెలిపారు. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ది చేస్తామన్నారు. మూసీ నదిలో మురుగునీరు చేరుకుండా 39 ఎన్టీపీలు నిర్మాణం చేపడతామన్నారు. ఓఆర్‌ఆర్‌ తరహాలో రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని, ఆర్ఆర్ఆర్ చుట్టూ ఎంఎస్‌ఎంఈ పార్కులు రాబోతున్నాయన్నారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి పంపాలని నిర్ణయించామని తెలిపారు. ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్‌కు అనుబంధంగా రేడియల్ రోడ్స్ నిర్మిస్తామని, వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రాబోతున్నాయన్నారు. బుల్లెట్ ట్రైన్లకు శంషాబాద్ కేంద్రంగా మారబోతుందని, ప్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే ఉంటుందన్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్దికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నామని, 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీని ఇటీవల మూడు కార్పొరేషన్లుగా విభజించామని, హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లగా విభించినట్లు తెలిపారు.