Reading Time: < 1 minute

భార్య తనకు విడాకులు ఇవ్వడంలేదనే కోపంతో కత్తితో దాడి చేసిన భర్తను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న వడ్డెమాన్ నిర్మల, వడ్డెమాన్ అడివన్నకు 2009లో వివాహం అయింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అడివన్న, ఈ సంబంధాన్ని మూడేళ్ల నుంచి కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య విడాకులు ఇస్తే ఆ మహిళను వివాహం చేసుకుంటానని నిర్మలతో పలుమార్లు గొడవపడ్డాడు. గత నెల 18వ తేదీన నిర్మలతో గొడవపడిన అడివన్న ఆమెను విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో గాయపడింది.

కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించడంతో ఆరోగ్యం బాగుపడి, ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. పెద్దలు సర్ది చెప్పడంతో నిర్మల, అడివన్న పై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిని అలుసుగా తీసుకున్న అడివన్న రెండు రోజుల క్రితం మరోసారి మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిర్మలను దూషించడంతో పాటు కడుపులో తన్నాడు. అంతటితో ఆగకుండా కత్తితో బెదిరిస్తూ నిర్మలతో పాటు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకుల కోసం తన భర్త తనపై కత్తితో దాడి చేశాడని, అతడివల్ల తనకు, తనపిల్లలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై అడివన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.