
న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని మోడీ తెలిపారు. అలాగే 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్టు కార్నీ వెల్లడించారు.
స్వామి వివేకానంద సూక్తి ప్రస్తావన
1893లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన విషయాన్ని మార్క్ కార్నీ గుర్తు చేసుకున్నారు. “లేవండి, మేల్కొనండి.. లక్షం చేరేవరకు ఆగకండి”’ అని వివేకానంద సూక్తిని ప్రస్తావించారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు.