
టెహ్రాన్ : దక్షిణ ఇరాన్ లో మినాబ్ నగరంలోని భూమి 165 చిన్నారుల సమాధుల తవ్వకాలకు సిద్ధమవుతోంది. ఇందులో 160 కి పైగా విద్యార్థినుల మృతదేహాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో వేగంగా యుద్ధం విస్తరిస్తున్న సమయంలో శనివారం అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రాథమిక పాఠశాల బలైపోవడం తీరని విషాదం. ఈ సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌అరాగ్చీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాంబు దాడులకు చిన్నారుల మృతదేహాలు ముక్కలుముక్కలుగా చిందరవందరయ్యాయన్నారు.
ప్రజలకు భద్రత కల్పిస్తానని, అందర్నీ రక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన “వాగ్దానం” అసలు స్వరూపం ఇదని అనాగ్చీ ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు. గాజా నుంచి మినాబ్ వరకు అమాయకుల రక్తాన్ని ట్రంప్ కళ్లారా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలపై ఆస్పత్రులపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం యుద్ధనేరమని భగ్గుమన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఈ సామూహిక ఖననం మంగళవారం నిర్వహించినప్పుడు మరోవైపు టెలివిజన్ దృశ్యాల్లో వేలాది మంది విషాదంతో “ ఇది అమెరికాకే మరణం ” అని నినదించడం గమనార్హం.
మృతుల్లో ఎటేనా అనే బాలిక తల్లి అక్కడి జనం ముందు నిల్చొని ముద్రించిన మృతుల చిత్రాలను పట్టుకుని భావోద్వేగం చెందింది. మృతుల ముఖాలు “అమెరికా నేరాలకు సాక్షంగా కనిపించే ఒక డాక్యుమెంట్” అని గట్టిగా అరిచారు. “ఈ చిన్నారులు భగవంతుని మార్గంలో చనిపోయారు.” అని బాధను వ్యక్తం చేశారు. అక్కడి జనం అంతా “ఇది అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు” “ లొంగేది లేదు ” అని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, ఈ విషాద సంఘటనకు అమెరికా అధికారులు తమంత తాము వేగంగా దూరమయ్యారు.
అమెరికా రక్షణ మంత్రి మార్కో రుబియో విలేకరులతో మాట్లాడుతూ డిపార్టుమెంట్ ఆప్ వార్ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తోందని, ఉద్దేశపూర్వకంగా ఒక పాఠశాలను అమెరికా టార్గెట్ చేసుకోలేదని చెప్పుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ అధికారులు విరుద్ధ సమాధానాలు చెప్పారు. మీనాబ్‌పై దాడుల గురించి అంతగా తెలియదని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి మొదట్లో చెప్పినప్పటికీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్( ఐఆర్‌జిసి ) ఈ దాడికి బాధ్యులై ఉండవచ్చని ఇజ్రాయెల్ పేర్కొంది.