Reading Time: < 1 minute

రాహుల్‌గాంధీ, -రేవంత్ రెడ్డి (ఆర్‌ఆర్) ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్‌తోనే రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీకి నిజంగా తెలంగాణ ప్రజల సమస్యలపై కనీస అవగాహన, ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు రాగానే మొదట వాటి అమలుపై సమీక్షించేవారని విమర్శించారు. హామీలు ఎలా అమలు అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసేవారని, అయితే ఇసుమంతైనా జవాబుదారీతనం లేని రాహుల్ గాంధీ నుంచి ఇలాంటివి ఆశించడం

తెలంగాణ ప్రజల దురదృష్టమని ఆయన ఎక్స్‌వేదికగా సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలపై రాహుల్ గాంధీ ఊసెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మతిమరుపు ఉందేమో కానీ తెలంగాణ ప్రజలకు లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించాలని చురకలు వేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలతో చేసిన గోబెల్స్ ప్రచారం ఎన్నికల్లో గెలిచాక ముఖం చాటేసి, మీరు చేసిన మోసానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని కిషన్‌రెడ్డి తన పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు.