Reading Time: < 1 minute

ఇరాన్‌లోని అతి పెద్ద నటాంజ్ అణు కేంద్రం సోమవారం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో దెబ్బతిందని, దీనితో బారీ స్థాయిలో అణుధార్మికత వెలువడుతోందని వార్తలు వెలువడ్డాయి.పైగా ఇరాన్ అధికారికంగా ఈ దాడి గురించి తెలిపింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ)కు విషయం తెలిపింది. జాగ్రత్తల గురించి అభ్యర్థించిందని ఇరాన్ వార్తా సంస్థలు తెలిపాయి. అంతర్జాతీయంగా ఈ అంశం కలవరం కల్గించింది. పలు దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో పరిస్థితి చేజారిపోతోందని అమెరికా ఈ స్థావరంపై దాడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ముందుగా వెల్లడైంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ భద్రతా బలగాలు (ఐడిఎఫ్) బారీ ఆపరేషన్‌ను నిర్వహించాయని తెలిసింది. అయితే ఇటువంటి దాడి ఏమి జరగలేదని ఆ తరువాత అణు సంస్థ వివరణ ఇచ్చింది. ఐఎఇఎ అధినేత నుంచి ప్రకటన వెలువడింది.

ఇందులో వైమానిక దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలకు ముప్పు వాటిల్లిందనే అంశం నిర్థారణ కాలేదని తెలిపింది. కానీ తమ అణు కేంద్రం దెబ్బతిందని ఈ సంస్థ పరిధిలో ఉండే ఇరాన్ రాయబారి రెజా నజాఫీ వాదించారు. ఇజ్రాయెల్, అమెరికాలు భీకర దాడికి దిగిన క్రమంలో ఈ ప్రాంత పౌరులకు పెను ముప్పు తలెత్తేలా ధ్వంసం జరిగిందని, అంతర్జాతీయ అణు సంస్థ దీనిపై వెంటనే స్పందించాల్సి ఉందని రెజా తెలియచేసుకున్నారు. అయితే దీనిపై తరువాత అణు సంస్థ ఎటువంటి స్పందనా చేయలేదు. అయితే తమ ఇప్పటి పరిశీలనలో ఇరాన్‌లోని బషెహర్ అణు కేంద్రం లేదా టెహరాన్‌లోని పరిశోధనా కేంద్రం కానీ ఇతర అణు ఇంధన సంస్థలు లేదా కేంద్రాలకు ఎటువంటి ముప్పు వాటిల్లిలేదని తేలిందని ఐఎఇఎ అధినేత రాఫెల్ గ్రాసి వివరించారు.