
ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీం ఇండియా కుప్పకూలిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టి-20 నెంబర్.1 బ్యాటర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు టోర్నమెంట్‌లో పరుగుల ఖాతా తెరిచాడు. గత మూడు మ్యాచుల్లో డకౌట్ అయిన అభిషేక్ ఈ మ్యాచ్‌లో పరుగులు చేశాడు. కానీ, 15 పరుగులకే ఔట్ అయి.. మరోసారి ఫ్యాన్స్‌ని నిరాశ పరిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారని.. టీం ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అలాగే వాళ్లు అభిషేక్‌ను కట్టుదిట్టం చేశారని అన్నారు.
‘‘నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదటి బంతికే ఔటైనా.. తర్వాతి బంతిని ఎదుర్కొవచ్చు. కానీ, మ్యాచ్‌లో అలా ఉండదు. ఒత్తిడి మిమ్మల్ని స్తంభింపచేస్తుంది. పెద్ద షాట్లు కొట్టనీయకుండా చేతులను కట్టడి చేస్తుంది. అభిషేక్ ఒత్తిడి వల్లే స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా వ్యూహరచన చేశారు. వారికి తెలుసు.. అతడు రూమ్ చేసుకొని ఆఫ్ సైడ్ ఆడతాడని.. రబాడ సిక్స్ ఇచ్చిన తర్వాత కూడా అవిశ్రాంతంగా అభిషేక్ శర్మ ప్యాడ్లనే టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు’’ అని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు.