Reading Time: < 1 minute

సర్కారు బడుల్లో సమ్మర్ జోష్..మే 11 నుంచి 25 వరకు క్యాంప్లు

Caption of Image.
  • ఈ నెల11 నుంచి 25 వరకు క్యాంప్​లు
  • రాష్ట్రవ్యాప్తంగా 533 పీఎంశ్రీ హైస్కూళ్లు ఎంపిక 
  • ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల్లో సర్కారు బడుల విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 533 పీఎంశ్రీ హైస్కూళ్లలో ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్​లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని సక్రమంగా నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. 

రూ.2.66 కోట్లు మంజూరు

సమ్మర్ క్యాంప్​ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2,66,50,000 మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలలకు రూ.50 వేల చొప్పున కేటాయించారు. ఈ నిధులను తక్షణమే ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్ల అకౌంట్లకు రిలీజ్​చేయాలని డీఈవోలను డైరెక్టర్​ఆదేశించారు. క్యాంప్​లు ముగిసిన తర్వాత ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు. 

అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఎంట్రీ 

ఈ సమ్మర్ క్యాంప్​లు కేవలం పీఎంశ్రీ స్కూళ్ల విద్యార్థులకే పరిమితం చేయకుండా.. పొరుగున ఉన్న ఇతర సర్కారు బడుల విద్యార్థులూ పాల్గొనేలా అవకాశం కల్పించారు. ప్రతి క్యాంప్​ను సెక్టోరల్ ఆఫీసర్లు, ఎంఈవోలు ప్రతిరోజూ పర్యవేక్షించాలని డైరెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు వేసవి వేడి నుంచి ఇబ్బంది కలగకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో శిక్షణ ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.