
- లోక్‌భవన్ వెళ్లను.. రాజీనామా చేయను
- ఇది ప్రజా తీర్పు కాదు.. బీజేపీ పన్నిన కుట్ర: మమతా బెనర్జీ
- మేం పోరాడింది బీజేపీతో కాదు.. ఎలక్షన్ కమిషన్‌తో..
- బెంగాల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు
- ఈవీఎంలను తారుమారు చేస్తూ.. సీఈసీ ఓ విలన్‌గా మారారు
- పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో
- 80-90 శాతం చార్జింగ్ ఎలా ఉంటుంది?
- నా జీవితకాలంలోనే ఇలాంటి ఎలక్షన్స్ చూడలే
- ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు..
- దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును కాజేశారు
- నా కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి తరిమేశారు
- వీధుల్లోకి వస్తా.. బీజేపీ అరాచకాలను ఎండగడతా
- ఇండియా కూటమి బలోపేతానికి పనిచేస్తానని వెల్లడి
కోల్‌కతా: సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, లోక్‌భవన్‌కు వెళ్లనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాము బీజేపీతో పోరాడలేదని, ఎలక్షన్ కమిషన్ (ఈసీ)తో పోరాడామని అన్నారు. ఇది ప్రజా తీర్పు కాదని, బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. తన జీవితకాలంలోనే ఇలాంటి ఎన్నికలను చూడలేదని అన్నారు. తమ పార్టీ ఓటమి వెనుక ఎన్నికల కమిషన్ హస్తం ఉందని ఆరోపించారు.
‘‘ బీజేపీ చెప్పినట్టుగా ఈసీ అధికారులు పనిచేశారు. సుమారు 100 నియోజకవర్గాల్లో మా గెలుపును దోచుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదిగా చేస్తూ మా కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించి, 39 లక్షల కొత్త పేర్లను మాకు తెలియకుండా ఎలా చేర్చారో సమాధానం చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘నేను ఎందుకు రాజీనామా చేయాలి? నేను ఓడిపోలేదు. ఒకవేళ ధర్మబద్ధంగా ఓడిపోతే నేను రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా ఇచ్చేదాన్ని. బలవంతంగా నన్ను కుర్చీ నుంచి దించాలని చూస్తే అది జరగదు. నా పార్టీ నా వెంటే ఉంది. భవిష్యత్ కార్యాచరణను ఉమ్మడిగా నిర్ణయిస్తాం’’ అని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ కాలరాసిందని మమత అన్నారు. ఈవీఎంలను తారుమారు చేస్తూ.. సీఈసీ ఓ విలన్‌గా మారారని మండిపడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 80–-90 శాతం చార్జింగ్ ఉండటం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం ప్రారంభించి, అడుగడుగునా సోదాలు నిర్వహించారన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులందరినీ మార్చేసి, ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ కుట్రపూరిత గేమ్ ఆడిందని మండిపడ్డారు.
తాము కేవలం పార్టీతోనే కాదు.. తమకు వ్యతిరేకంగా మారిన అన్ని ప్రభుత్వ యంత్రాంగాలతో పోరాడామని చెప్పారు. ఎస్ఐఆర్ పేరిట 90 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తే, తాము కోర్టుకు వెళ్లాక 32 లక్షల పేర్లు చేర్చారని చెప్పారు. ఎన్నికల తర్వాతి హింసపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఉల్టాగా టీఎంసీ కార్యకర్తలపైనే బీజేపీ దాడులు చేస్తోందని, అభిషేక్ బెనర్జీ ఆఫీసును కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. వీటిపై విచారణకు 10 మంది సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మహిళలను లైంగికంగా వేధిస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
నాపై దాడి.. సిగ్గులేని చర్య
కౌంటింగ్ రోజున భవానీపూర్ కేంద్రంలో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని మమత ఏకరువు పెట్టారు. ‘‘నేను ఒక మహిళను అని కూడా చూడకుండా సెంట్రల్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లు గూండాలకంటే హీనంగా ప్రవర్తించారు. నన్ను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా బయటకు నెట్టేసే క్రమంలో నా కడుపులో, వీపుపై తన్నారు. ఆ సమయంలో అక్కడి సీసీ టీవీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
ఇండియా కూటమి మద్దతు.. వీధుల్లోనే పోరాటం!
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలందరూ తనతో టచ్‌లో ఉన్నారని మమత తెలిపారు. ఫలితాల అనంతరం.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రేలాంటి నేతలు తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారన్నారు. ‘‘నాకు పదవి ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యం. ఇప్పుడు నేను ఫ్రీబర్డ్‌ను. ఒక సామాన్యురాలిగా వీధుల్లోకి వచ్చి బీజేపీ ఆట కట్టిస్తాను. పులిలా పోరాడి మళ్లీ పుంజుకుంటాం” అని పేర్కొన్నారు. ఇండియా కూటమి బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.
ముందే రాసిన స్క్రిప్ట్ ఇది
తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సువేందు అధికారి గెలుపును మమత తప్పుపట్టారు. ‘‘నేను 32,000 ఓట్ల మెజారిటీతో గెలవాలి. కానీ చివరి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి 200 మంది గుండాలు, 200 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో లోపలికి వచ్చి మా ఏజెంట్లను కొట్టి గెలుపును మార్చేశారు. 15 రోజుల క్రితమే ‘కౌంటింగ్‌లో ఖేలా (మాయాజాలం) జరుగుతుంది’ అని నాకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి మెసేజ్ వచ్చింది. ఇది ముందే రాసిన స్క్రిప్ట్”అని ఆరోపించారు.