Reading Time: 2 minutes

కేరళలో పనిచేసిన తెలంగాణ మోడల్‌‌..aయూడీఎఫ్ గెలుపులో రేవంత్‌‌ వ్యూహం

Caption of Image.
  • కలిసొచ్చిన సీఎం, మంత్రుల ప్రచారం
  • ఇది స్ఫూర్తిదాయక విజయం: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం వెనుక తెలంగాణ మోడల్,  సీఎం రేవంత్ రెడ్డి ప్రచార వ్యూహాలు ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్​ స్టార్ క్యాంపెయినర్‌‌గా పలు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌‌లలో పాల్గొన్న సీఎం రేవంత్​.. ‘నీ పో మోనే విజయన్'(విజయన్​ నీ టైం అయిపోయింది వెళ్లిపో) లాంటి నినాదాలతో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అటు కేంద్రంలోని బీజేపీకి, ఇటు రాష్ట్రంలోని లెఫ్ట్ ఫ్రంట్‌‌కు మధ్య రహస్య అవగాహన ఉందంటూ రేవంత్ చేసిన ఆరోపణలు ఓటర్లలో చర్చకు దారితీశాయని చెప్తున్నారు. ముఖ్యంగా పినరయి విజయన్ హయాంలోని వైఫల్యాలను, వివాదాలను ఎండగడుతూనే, కాంగ్రెస్ పూర్వ వైభవానికి సంబంధించిన అంశాలను రేవంత్​బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ సందర్భంగా ఇద్దరు విజయన్​, రేవంత్​ రెడ్డి మధ్య లేఖస్ర్తాలు నడిచాయి. ఈ లేఖలు రెండు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. దీంతో పాటు  తెలంగాణలో అమలవుతున్న  సంక్షేమ పథకాలను కేరళ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. స్వయంగా సీఎం రేవంత్​ యూడీఎఫ్​ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్​ చేశారు. ఆరు గ్యారంటీలు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి ‘తెలంగాణ మోడల్’ పథకాలపై అక్కడి మహిళా ఓటర్లలో సానుకూలత వ్యక్తమైందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనపై రేవంత్​ ఇచ్చిన భరోసా కూడా కలిసివచ్చిందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల  ప్రచారం, అడుగడుగునా తెలంగాణ సంక్షేమ పథకాల అమలవుతున్న తీరును ప్రస్తావించడం కేరళలో కాంగ్రెస్  కూటమి అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఇది స్ఫూర్తిదాయక విజయం : సీఎం ట్వీట్​

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్  కూటమి సాధించిన ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కఠిన శ్రమతో, స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్న కూటమి నేతలకు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో సీఎం ట్వీట్ చేశారు. ఈ చారిత్రాత్మక గెలుపునకు సారథ్యం వహించిన ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.  తెలంగాణ, కేరళ రాష్ట్రాలు గొప్ప ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినవని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. గత పదేళ్లుగా సాగిన నిరాశ, నమ్మకద్రోహానికి ముగింపు పలికిన ప్రజలు.. అభివృద్ధి కోసం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని కొనియాడారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశించిన విధంగానే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో ఉజ్వల భవిష్యత్తు సాకారం కాబోతోందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళ విజయం దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలను ఇచ్చిందని ఆయన తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.