
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అసాధారణ ఆధిపత్యాన్ని చాటుకుంది. 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్, ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పడమే కాకుండా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ఒక జట్టుపై మరో జట్టు సాధించిన అత్యధిక వరుస విజయాల రికార్డు ఇదే. గతంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన 8 వరుస విజయాల (2010-2024) రికార్డును ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పుడు అధిగమించింది. ఈ జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్ (9 విజయాలు) మొదటి స్థానంలో ఉండగా, సీఎస్‌కే vs ఆర్సీబీ (8), సీఎస్‌కే vs ఢిల్లీ క్యాపిటల్స్ (7), ముంబై ఇండియన్స్ vs కేకేఆర్ (7) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అంతేకాకుండా.. హైదరాబాద్‌లో పంజాబ్‌తో ఆడిన 11 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది 10వ విజయం. ఒకే వేదికపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. ఈ విభాగంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 11 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ 10 విజయాలతో రెండో స్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్ విశేషాల్లోకి వెళ్తే.. హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 235/4 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (13 బంతుల్లో 35), ట్రావిస్ హెడ్ (38 పరుగులు) పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించి కేవలం 21 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. పంజాబ్ జట్టు ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు సన్‌రైజర్స్‌కు బాగా కలిసొచ్చాయి. ఇషాన్ కిషన్ ఇచ్చిన మూడు అవకాశాలను, అలాగే క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను పంజాబ్ ఫీల్డర్లు వదిలేశారు. దీనిని సద్వినియోగం చేసుకున్న కిషన్ (55 పరుగులు), క్లాసెన్ (69 పరుగులు) కలిసి 88 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే క్లాసెన్ ఈ సీజన్‌లో 494 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టోయినిస్, సూర్యాన్ష్ షెడ్జ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అయితే పంజాబ్ తరఫున 22 ఏళ్ల ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కానలీ అద్భుత పోరాటం చేశాడు. కానలీ అజేయంగా 107 పరుగులు చేసి తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన విదేశీ ఆటగాడిగా క్వింటన్ డికాక్ రికార్డును అతను బద్దలు కొట్టాడు.
కానలీ ఒంటరి పోరాటం చేసినప్పటికీ పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించి టాప్-2 రేసులో బలంగా నిలిచింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని కోల్పోయింది.