
హైదరాబాద్, వెలుగు: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన 2022 బ్యాచ్ విద్యుత్ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించి, ‘రైతు డిస్కమ్’లో చేర్చుకోవాలని విద్యుత్ ఇంజినీర్ల సంఘం నేతలు కోరారు. బుధవారం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీకి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు బి. రాజా రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి టి. మహేశ్ పలు కీలక అంశాలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.
విధుల్లో చేరి మూడున్నరేండ్లు దాటినా, రికార్డుల్లో ఇంకా ప్రొబేషనరీ పీరియడ్‌లోనే చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి తక్షణమే రెగ్యులర్ హోదా కల్పించి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. రైతు డిస్కమ్‌లో చేరాలనుకునే 2022 బ్యాచ్ ఇంజినీర్లకు ఏడీఈతో పాటు ఏఈ ఆప్షన్లు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ట్రైనీ అసిస్టెంట్ ఇంజినీర్లకు కూడా ఏఈ ఆప్షన్ కల్పించాలని కోరారు. ఏడీఈ పదోన్నతులలో ఏఈలు, ఏఏఈల మధ్య ప్రస్తుతం ఉన్న 4:1 నిష్పత్తిని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనల్లో ఎలాంటి సడలింపులు చేసినా పదోన్నతి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతు డిస్కమ్‌లో చేరాలనుకునే ఏఈలకు కేవలం ఏడీఈ ఆప్షన్ మాత్రమే ఇస్తున్నారని, అలా కాకుండా ఏఈలుగా కొనసాగేందుకు కూడా ప్రత్యేక అవకాశం కల్పించాలని సంఘం నేతలు సీఎండీని కోరారు.