
కోల్‌కతా: బెంగాల్ ఎన్నికల ప్రచార సమయంలో ఝార్గ్రామ్ మీదుగా వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా వాహనాన్ని ఆపి ఒక సామాన్య వ్యాపారి వద్ద ‘ఝల్మురి’ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఒక ర్యాలీలో స్పం దించిన ప్రధాని.. “నేను ఝల్మురి తిన్నాను కానీ, దాని ఘాటు మాత్రం టీఎంసీకి బలంగా తగిలింది” అంటూ చమత్కరించారు.
అంతేకాకుండా, మే 4న బీజేపీ విజయోత్సవాల్లో మిఠాయిలతోపాటు ఝల్మురి కూడా పంచుతామని ప్రకటించారు. ఆయన అన్నట్టుగానే సోమ వారం ఫలితాలు రావడంతో బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
ఏమిటీ ‘ఝల్మురి ఎఫెక్ట్’?
ఒక చిన్న సంఘటన బెంగాలీ ప్రజలతో ప్రధాని మోదీని భావోద్వేగంగా కనెక్ట్ చేసింది. బెంగాలీలకు అత్యంత ఇష్టమైన చిరుతిండిని ఆస్వాదించడం ద్వారా మోదీ తాను బయటి వ్యక్తిని కాదని, ‘భూమి పుత్రుడిని’ అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. దేశ ప్రధాని హోదాలో ఉండి కూడా ఒక సామాన్యుడిలా రోడ్డు పక్కన బండి వద్ద రూ.10 ఇచ్చి మరీ ‘ఝల్మురి’ తినడం అక్కడి ఓటర్లు, సామాన్య ప్రజానీకాన్ని విశేషంగా ఆకట్టుకుంది.