Reading Time: < 1 minute

బ్యాంకులు, ఈకామర్స్ సైట్స్ పంపే బిజినెస్ వాట్సాప్ మెసేజీలకు ఛార్జీలు.. ఎంతంటే?

Caption of Image.

వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌లో మెటా సంస్థ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉచితంగా అందుబాటులో ఉన్న కస్టమర్ సర్వీస్ మెసేజింగ్ సేవలకు స్వస్తి పలికింది. అక్టోబర్ 1 నుంచి వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ద్వారా పంపే సర్వీస్ మెసేజ్‌లపై ప్రతి మెసేజ్‌కు 11.5 పైసల చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ప్రతి బిజినెస్ నంబర్‌కు ప్రతినెలా 1,000 ఉచిత సర్వీస్ మెసేజ్‌ల కోటాను మాత్రం మెటా ఉచితంగా అందిస్తోంది.

ఈ కొత్త నిబంధనలు సాధారణ వ్యక్తిగత వాట్సాప్ వినియోగదారులకు, చిన్న వ్యాపారాలు ఉచితంగా వాడే వాట్సాప్ బిజినెస్ యాప్‌కు వర్తించవు. కేవలం పెయిడ్ వాట్సాప్ బిజినెస్ ఏపీఐని ఉపయోగించి పెద్దఎత్తున ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ నిర్వహించే సంస్థలపై మాత్రమే ఈ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా AI ఆధారిత చాట్‌బాట్‌లను వాడే సంస్థలకు నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా ఈకామర్స్, ఫిన్‌టెక్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ట్రావెల్, హాస్పిటాలిటీ వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. ఈ రంగాలకు చెందిన కంపెనీలు తమ కస్టమర్లకు ఆర్డర్ అప్‌డేట్స్, చెల్లింపుల నోటిఫికేషన్లు, సపోర్ట్ టికెట్ రిప్లైలు, ఆటోమేటెడ్ చాట్‌ల కోసం వాట్సాప్ ఏపీఐని భారీగా వాడుతుంటాయి. రోజువారీ వేలాది మంది వినియోగదారులతో ఇంటరాక్ట్ అయ్యే ఈ పెద్ద సంస్థల నెలవారీ నిర్వహణ ఖర్చులు మెటా నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.

►ALSO READ | వాట్సాప్ బిజినెస్ మెసేజీలకు ఛార్జీలు : అక్టోబర్ ఒకటి నుంచి ఫ్రీ బంద్

స్పామ్ మెసేజ్‌లను అరికట్టడానికి, ఇతర కస్టమర్ కేర్ ఛానెళ్లతో సమానంగా వాట్సాప్ ఆర్థిక విధానాన్ని మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా తెలిపింది. ఈ కొత్త ఛార్జీల మోతతో కంపెనీలు తమ కస్టమర్ కమ్యూనికేషన్ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

©️ VIL Media Pvt Ltd.