Reading Time: 3 minutes
Wildlife Decline Explained Why More Natural Disasters May Follow

మనిషి తన చేతులతో ప్రపంచాన్ని మార్చుకున్నాడు. నేలను కోసి నగరాలు కట్టుకున్నాడు. నదులకు గోడలు కట్టి వాటి ప్రవాహాన్ని తన అవసరాలకు మలుచుకున్నాడు. పర్వతాల గుండెల్లోకి వెళ్లి వాటి లోపల దాగి ఉన్న సంపదను బయటకు తీశాడు. ఇలా ఒక జీవి బతకడానికి అవసరమైన స్థలాన్ని తన సౌకర్యానికి మార్చుకున్న ప్రతిసారీ దానికి అభివృద్ధి అనే పేరు పెట్టుకున్నాడు.

తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే అంత గొప్ప నాగరికతగా భావించాడు. కానీ ఆ నాగరికత నీడలో ఒక ప్రపంచం నెమ్మదిగా మాయమవుతూ వచ్చింది. 2026లో మన చుట్టూ చూస్తే అడవులు తగ్గుతున్నాయి, వన్యప్రాణుల ప్రపంచం కుంచించుకుపోతోంది, మనిషితో ఈ భూమిని పంచుకున్న అనేక జీవుల భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఈ దృశ్యం ఒక్కసారిగా మన ముందుకు రాలేదు. మనిషి నాగరికత ఒక రోజులో ప్రకృతిని మార్చలేదు. ప్రతి తరం తనకు ముందు ఉన్న ప్రపంచం నుంచి కొంచెం తీసుకుంది. ఒక అడవి నుంచి కొంత భూమి తీసుకుంది. ఒక నది నుంచి కొంత నీరు తీసుకుంది. ఒక సముద్రం నుంచి మరిన్ని జీవులను తీసుకుంది. ఒక పర్వతం నుంచి మరింత సంపదను తీసుకుంది.

తీసుకున్నది చిన్నదిగానే కనిపించింది కానీ తరాలు మారే కొద్దీ ఆ చిన్న చిన్న తీసుకోవడాలన్నీ కలిసి ఒక పెద్ద మార్పుగా మారాయి. ఒక రోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు.. మనిషి నిర్మించిన ప్రపంచం పెరిగిన సమయంలో తనతో కలిసి జీవించిన ప్రపంచం మాత్రం చిన్నదైపోయింది. ఇది కేవలం అడవుల కథగా చూడటం కూడా ఈ మార్పు లోతును తగ్గించినట్టే. ఎందుకంటే అడవి అంటే మనిషి కళ్లకు కనిపించే చెట్లు మాత్రమే కాదు కదా.. ఒక చెట్టు నీడలో బతికే జీవితం, దాని కొమ్మల్లో గూడు కట్టే పక్షి, దాని వేర్ల మధ్య కదిలే జీవులు, ఆ జీవులను ఆధారంగా చేసుకునే మరొక జీవి.. ఇవన్నీ కలిసి ఒక ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మనిషి ఒక అడవిని తొలగించినప్పుడు అతని ముందు భూమి మాత్రమే మిగులుతుంది. ప్రకృతి దృష్టిలో మాత్రం ఒక జీవ ప్రపంచం తన బంధాలను కోల్పోతుంది.

ఇక్కడి నుంచి మనిషి నాగరికతను మరో కోణంలో చూడాల్సి వస్తుంది. మనిషి ప్రకృతిని జయించలేదు. ప్రకృతిలో తనకు కావాల్సినదాన్ని ఎంచుకుని, మిగిలినదాన్ని పక్కకు నెట్టే శక్తిని సంపాదించాడు. ఆ శక్తి మొదట జీవించడానికి ఉపయోగపడింది. తర్వాత సౌకర్యం కోసం ఉపయోగపడింది. ఆ తర్వాత సంపద కోసం ఉపయోగపడింది. చివరికి అవసరానికి మించి వినియోగించడానికి ఉపయోగపడింది. ప్రకృతి ఒక జీవ ప్రపంచం నుంచి మనిషి అవసరాల జాబితాగా మారిపోయింది.

2014లో వెలువడిన ఒక నివేదిక చూస్తే మనిషి ఎంత స్వార్థంగా ముందుకువెళ్తున్నాడో అర్థమవుతుంది. ప్రపంచ వన్యప్రాణి నిధి సంస్థ, జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కలిసి రూపొందించిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అది. ఆ నివేదికలో 1970 నుంచి 2010 వరకు పరిశీలించిన వెన్నెముక ఉన్న జంతువుల జనాభాల్లో సగటున 52 శాతం తగ్గుదల కనిపించింది. అంటే కేవలం 40 సంవత్సరాల కాలంలో.. మనిషి తన ప్రపంచాన్ని విస్తరించుకుంటున్న సమయంలోనే, అతనితో కలిసి జీవిస్తున్న వన్యప్రాణుల జనాభాలు భారీగా వెనక్కి వెళ్లాయి. ఆ సంఖ్య అప్పట్లో ఒక హెచ్చరికలా నిలిచింది. కానీ హెచ్చరిక వచ్చిన తర్వాత కథ ఎటు వెళ్లింది? తర్వాతి సంవత్సరాలు మనిషి వేగాన్ని తగ్గించలేదు.

నగరాలు మరింత విస్తరించాయి. వినియోగం మరింత పెరిగింది. అడవులపై ఒత్తిడి కొనసాగింది. జీవుల నివాస ప్రాంతాలు విడిపోయాయి. నదులు మరింతగా మనిషి అవసరాలకు కట్టుబడ్డాయి. సముద్రాల్లో వేట, కాలుష్యం, ఉష్ణోగ్రతల మార్పు వంటి ఒత్తిళ్లు కొనసాగాయి. ప్రకృతిపై మనిషి ఆధారపడుతున్న విధానం మారకుండానే.. ప్రకృతి నుంచి తీసుకునే పరిమాణం మాత్రం పెరుగుతూ వచ్చింది.

10 సంవత్సరాల తర్వాత మరోసారి అదే ప్రపంచాన్ని వెనక్కి చూసినప్పుడు.. చిత్రం మరింత తీవ్రంగా మారింది. 2024లో ప్రపంచ వన్యప్రాణి నిధి సంస్థ, జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం వన్యప్రాణుల జనాభా సగటు తగ్గుదల 73శాతంగా నమోదైంది. దాదాపు 5,495 జాతులకు సంబంధించిన సమాచారం ఈ అంచనాలో ఉంది. 52 నుంచి 73కి వచ్చిన ఈ ప్రయాణాన్ని రెండు సంఖ్యల మధ్య తేడాగా మాత్రమే చూడలేం. ఎందుకంటే ప్రతి తగ్గుదల వెనుక ఒక ప్రపంచం ఉంటుంది. ఒక అడవిలో అరుదుగా మారిన ఒక జీవి ఉంటుంది. ఒక నదిలో తగ్గిపోయిన చేపల సమూహం ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి దూరమైన పక్షుల గుంపు ఉంటుంది. ఒకప్పుడు సాధారణంగా కనిపించిన జీవి ఇప్పుడు కనిపించడానికి ప్రత్యేకంగా వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది.

మనిషి నిర్మించిన ప్రపంచం పెరుగుతున్నప్పుడు.. దాని మధ్యలో జీవించాల్సిన ఇతర జీవుల స్థలం క్రమంగా తగ్గిపోతుంది. ఈ మార్పు అన్ని ప్రాంతాల్లో ఒకే రీతిలో జరగలేదు. కొన్ని చోట్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. ముఖ్యంగా మంచినీటి జీవ ప్రపంచం మీద పడిన ఒత్తిడి చాలా పెద్దది.

1970 నుంచి 2020 మధ్య పరిశీలించిన మంచినీటి వన్యప్రాణుల జనాభాల్లో సగటున 85 శాతం తగ్గుదల నమోదైంది. నదులు, సరస్సులు, తడి ప్రాంతాలు మనిషి జీవితానికి నీటిని అందించే ప్రదేశాలుగా మాత్రమే కనిపించినప్పుడు.. వాటిలో నివసించే జీవ ప్రపంచం క్రమంగా మన దృష్టికి దూరమైంది. ఒక నది మనిషికి నీరు. అదే నది ఒక చేపకు ప్రపంచం. ఒక పక్షికి ఆహారం. ఒక మొక్కకు జీవం. ఒక గ్రామానికి ఆధారం. ఒక తడి ప్రాంతానికి శ్వాస. ప్రకృతిలో ఒక వస్తువు అనేక జీవితాలకు ఒకేసారి అర్థం అవుతుంది. మనిషి దాన్ని తన అవసరంతో మాత్రమే కొలిచినప్పుడు.. మిగిలిన అర్థాలన్నీ కనిపించకుండా పోతాయి. అందుకే వన్యప్రాణుల తగ్గుదల వెనుక ఒకే కారణాన్ని వెతకడం కష్టం.

అడవుల నష్టం ఉంది. జీవుల అధిక వినియోగం ఉంది. కాలుష్యం ఉంది. కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశించే ఆక్రమణ జాతులు ఉన్నాయి. వాతావరణ మార్పు ఉంది. వ్యాధుల ప్రభావం ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి దూరంగా ఉన్న సమస్యల్లా కనిపించినా.. వాటి మధ్యలో మనిషి నిర్మించిన జీవన విధానం ఒక బలమైన సంబంధంలా కనిపిస్తుంది.

మనిషి తన అవసరాల కోసం ప్రకృతిని మార్చాడు. తర్వాత ఆ మార్పును అభివృద్ధిగా పిలిచాడు. ఆ అభివృద్ధి మరిన్ని అవసరాలను సృష్టించింది. ఆ అవసరాలు మరింత ప్రకృతిని కోరుకున్నాయి. ఇలా ఒక వలయం ఏర్పడింది. ఆ వలయంలో మనిషి ముందుకు కదులుతున్న కొద్దీ.. అడవి వెనక్కి కదిలింది. అయితే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఇక్కడే ఉంది. మనిషి ప్రకృతిని తనకు వెలుపల ఉన్న ప్రపంచంగా ఊహించుకున్నాడు. తన నగరం ఒక ప్రపంచం, అడవి మరో ప్రపంచం అని భావించాడు. తన ఆర్థిక వ్యవస్థ ఒక ప్రపంచం, నది మరో ప్రపంచం అని భావించాడు. కానీ గాలి సరిహద్దులను గుర్తించదు. నీరు మనిషి వేసిన గీతలను పాటించదు. వాతావరణం దేశాల సరిహద్దులను అంగీకరించదు. ఒక జీవ వ్యవస్థలో వచ్చిన మార్పు ఇంకో వ్యవస్థను తాకకుండా ఉండదు. అంటే మనిషి ప్రకృతిని తనకు వెలుపల పెట్టుకున్నాడు. కానీ తాను ప్రకృతికి వెలుపలికి వెళ్లే మార్గాన్ని మాత్రం సృష్టించుకోలేకపోయాడు.

అందుకే ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి ఇతర జీవులకు గోతులు తియ్యడంతో పాటు తన గొయ్యిని కూడా తానే తీసుకుని చివరకు అందులోనే పడ్డాడు.. ఇదే నాగరికత అని గొప్పగా భావిస్తు తన భ్రమల్లో తానే బతుకున్నాడు!