Reading Time: 2 minutes
Cdsco Warns Against Overuse Of Painkillers And Antibiotics

తలనొప్పి వచ్చింది, ఒళ్లు నొప్పిగా ఉంది..వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. జలుబు, గొంతునొప్పి వచ్చిందంటే యాంటీబయాటిక్ మొదలుపెట్టడం చాలామందిలో కనిపించే అలవాటు. కానీ ఇలాంటి మందులను అవసరం లేకుండా పదేపదే వాడటం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీయొచ్చని దేశ అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ CDSCO హెచ్చరించింది.

ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను విచ్చలవిడిగా వాడటం వల్ల కిడ్నీలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని, యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకుండా తీసుకోవడం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

వైద్యులు, ఫార్మసిస్టులు, మందులు విక్రయించే వారు, అలాగే ప్రజలకు CDSCO కీలక సూచనలు చేసింది. నొప్పి, వాపు తగ్గించేందుకు ఉపయోగించే NSAIDs అనే పెయిన్ కిల్లర్లను వైద్యపరంగా అవసరమైనప్పుడు మాత్రమే, సరైన మోతాదులో, అవసరమైనంత కాలం మాత్రమే వాడాలని సూచించింది.

ముఖ్యంగా డాక్టర్ పర్యవేక్షణలోనే ఇలాంటి మందులు తీసుకోవాలని చెప్పింది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, జ్వరం లాంటి సాధారణ సమస్యలకు చాలామంది పెయిన్ కిల్లర్లను తరచూ తీసుకుంటుంటారు. అయితే ఇదే అలవాటు ఎక్కువకాలం కొనసాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నియంత్రణ సంస్థ హెచ్చరిస్తోంది. మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని NSAID మందులు కిడ్నీలకు వెళ్లే రక్తప్రవాహాన్ని తగ్గించగలవు. దీంతో కిడ్నీలు తమ పని సరిగ్గా చేయడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు, శరీరంలో నీరు తగ్గిపోయినవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, కిడ్నీల పనితీరును ప్రభావితం చేసే ఇతర మందులు వాడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

అందుకే ప్రతి వ్యక్తికి ఒకే మందు, ఒకే మోతాదు సరిపోతుందని అనుకోవద్దని CDSCO సూచించింది. వయసు, ఇతర అనారోగ్య సమస్యలు, ఇప్పటికే వాడుతున్న మందులు, కిడ్నీల పరిస్థితి లాంటి అంశాలను పరిశీలించిన తర్వాతే వైద్యులు పెయిన్ కిల్లర్‌ను సూచించాలని చెప్పింది.

అవసరమైనప్పుడు కూడా తక్కువ ప్రభావవంతమైన మోతాదుతో, సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో చికిత్స అందించాలని సూచించింది. ఇక మరో పెద్ద సమస్య యాంటీబయాటిక్స్ విషయంలో ఉంది. జ్వరం వచ్చిందని, గొంతు నొప్పిగా ఉందని, జలుబు చేసిందని సొంతంగా యాంటీబయాటిక్ వేసుకోవడం చాలామందిలో కనిపిస్తుంది. కానీ చాలా సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ పనిచేయవు. అయినప్పటికీ వాటిని అవసరం లేకుండా తీసుకుంటూ ఉంటే మన శరీరంలోని కొన్ని బ్యాక్టీరియాలు ఆ మందులను తట్టుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దీనినే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ లేదా AMR అంటారు.

ఇలా రెసిస్టెన్స్ పెరిగితే భవిష్యత్తులో సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కూడా మందులు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఫలితంగా చికిత్స మరింత క్లిష్టంగా మారి, ఇన్ఫెక్షన్లు ఎక్కువకాలం కొనసాగడం, సమస్యలు పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

అందుకే డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్‌ను ఆయన చెప్పిన మోతాదులో, చెప్పిన వ్యవధి వరకు మాత్రమే తీసుకోవాలని CDSCO స్పష్టం చేసింది. మిగిలిపోయిన యాంటీబయాటిక్‌ను తర్వాతి అనారోగ్యానికి ఉపయోగించడం, మరొకరికి ఇవ్వడం కూడా చేయొద్దు. ఈ హెచ్చరిక కేవలం ప్రజలకే పరిమితం కాలేదు. యాంటీబయాటిక్స్, ప్రిస్క్రిప్షన్ అవసరమైన NSAID మందులను నిబంధనలకు విరుద్ధంగా కౌంటర్‌పై విక్రయించకుండా ఫార్మసీలు, రిటైలర్లు జాగ్రత్తలు తీసుకోవాలని CDSCO ఆదేశించింది. ఈ మందుల్లో చాలా వరకు Schedule H, Schedule H1 కిందకు వస్తాయి. అంటే నిబంధనల ప్రకారం వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరం ఉంటుంది.

ఆసుపత్రులు, వైద్య సంస్థలు కూడా మందుల ప్రిస్క్రిప్షన్లను సమీక్షించడం, రోగులకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం, యాంటీబయాటిక్స్ వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి చర్యలను బలోపేతం చేయాలని CDSCO సూచించింది. రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా వైద్యులు, ఫార్మసిస్టులు, మందుల విక్రేతలు, ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించాలని ఆదేశించింది.