Reading Time: < 1 minute
Balakrishna Prabhas Pawan Kalyan Ram Charan Akhil Injuries During Movie Shootings

Tollywood Stars: టాలీవుడ్ స్టార్ హీరోలు వారి చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో పలువురు హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడటం కూడా తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ గాయపడిన ఘటనతో మరోసారి స్టార్ హీరోల ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఇటీవల ఎన్‌బీకే111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనకు మైనర్ సర్జరీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం కొద్ది రోజుల విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య త్వరలోనే షూటింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. చాలా కాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైంది. పూర్తిగా కోలుకున్న తర్వాత ఓజీ 2 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యువ హీరో అఖిల్ అక్కినేని కూడా ఇటీవల గాయం కారణంగా లెనిన్ సినిమా షూటింగ్‌కు కొంతకాలం దూరమయ్యారు. ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో చేతికి గ్లాస్ గుచ్చుకుపోయిందని, ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టిందని అఖిల్ స్వయంగా వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రెండు సార్లు గాయపడ్డారు. ఒకసారి చేతికి గాయమవగా, తాజాగా చివరి షెడ్యూల్‌లో కంటికి గాయమైంది. దీంతో సినిమా ప్రమోషన్లలో కూడా ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోకాలి గాయం గురించి కూడా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఆయన కాలికి గాయమవగా, అనంతరం ఒకసారి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయినప్పటికీ ఆ గాయం ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని, అదే కారణంగా కొన్ని చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇలా టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హీరోల ఆరోగ్యమే ముఖ్యమని సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.