Reading Time: 2 minutes
Bitter Gourd Onion Masala Recipe How To Make Crispy Kakarakaya Ulli Karam Without Bitterness

Kakarakaya Ulli Karam: కాకరకాయ అనగానే చాలామంది చేదు అని ముఖం తిప్పుకుంటారు. కానీ, సరైన పద్ధతిలో వండితే కాకరకాయ కంటే రుచికరమైన కూర మరొకటి ఉండదు. ముఖ్యంగా ఇందులోకి తయారుచేసే ‘స్పెషల్ ఉల్లి కారం’ ఈ కూరకు అద్భుతమైన రుచిని ఇస్తుంది. పోషకాలు ఏవీ పోకుండా, నోరూరించేలా ‘కాకరకాయ ఉల్లి కారం’ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

* కాకరకాయలు: ½ కేజీ
* పచ్చిశనగపప్పు: 1 టేబుల్ స్పూన్
* మినప్పప్పు: ½ టేబుల్ స్పూన్
* ధనియాలు: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: ½ టీస్పూన్
* చింతపండు: చిన్న ముక్క
* ఉల్లిపాయలు: 3
* కారం: 2 టీస్పూన్లు
* పసుపు: ½ టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు: 6
* బెల్లం పొడి: ½ టీస్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: వేయించడానికి సరిపడా
* కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా కాకరకాయలకు రెండు చివర్లు కట్ చేసి, పైన ఉండే రఫ్ పార్ట్‌ను తేలికగా చెక్కాలి. తర్వాత శుభ్రంగా కడిగి, ఒక అంగుళం సైజులో రౌండ్ రింగ్స్‌లా కట్ చేసుకోవాలి. ఈ రింగ్స్ మధ్యలో ఉండే పచ్చి విత్తనాలను తీసి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి (ఇవి పడేయకూడదు, వీటిలో పోషకాలు ఎక్కువ). పండిన విత్తనాలు ఉంటే మాత్రం తీసేయండి.

ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. అందులోనే ధనియాలు, జీలకర్ర వేసి మాడిపోకుండా వేయించాక, చిన్న చింతపండు ముక్క వేసి సెగపై కాసేపు ఉంచి స్టవ్ ఆపేయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అదే జార్‌లో కట్ చేసిన ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా రుబ్బుకుంటే ఉల్లి కారం రెడీ.

కడాయిలో 4–5 టేబుల్ స్పూన్ల నూనె వేసి, కాకరకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన కాకరకాయ ముక్కలు చల్లారాక, మనం తయారు చేసుకున్న ఉల్లి కారాన్ని ఆ రింగ్స్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. కాకరకాయలు వేయించగా మిగిలిన నూనెలో మనం సన్నగా తరిగిన కాకరకాయ విత్తనాలను వేసి సన్నని మంటపై క్రిస్పీగా వేయించాలి. విత్తనాలు వేగాక, స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసేయాలి.

లో-టు-మీడియం ఫ్లేమ్ మీద మూత పెడుతూ, మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు (10–15 నిమిషాలు) బాగా వేయించాలి. చివరిగా అర టీస్పూన్ బెల్లం పొడి చల్లి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆఖరున కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి హై ఫ్లేమ్ మీద అర్ధ నిమిషం టాస్ చేసి దింపేస్తే నోరూరించే కాకరకాయ ఉల్లి కారం సిద్ధం. ఈ వేడి వేడి కాకరకాయ ఉల్లి కారాన్ని అన్నంలోకి తింటే అద్భుతంగా ఉంటుంది. లంచ్ లేదా డిన్నర్‌లో రసం, సాంబార్ లేదా పప్పుచారు కాంబినేషన్‌తో సర్వ్ చేస్తే ఇంట్లో అందరూ పసందైన విందు ఆస్వాదిస్తారు.