Reading Time: < 1 minute
Educational Institutions Bandh Today In Telangana Student Unions Call For Statewide Protest

Student Protest: రాష్ట్రవ్యాప్తంగా నేడు (శుక్రవారం) విద్యా సంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU తదితర విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ.. విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.

ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాయి. VBSA బిల్లును వెనక్కి తీసుకోవడంతో పాటు, NEET పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస వైఫల్యాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు ఇప్పటికే బంద్ ప్రకటించడంతో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. బంద్‌లో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.