July 19, 2026

ప్రమోషన్‌తో శత్రువులుగా మారిన సహఉద్యోగులు.. ఆఫీస్ పాలిటిక్స్‌పై సలహాలు కోరిన మేనేజర్

ప్రమోషన్‌తో శత్రువులుగా మారిన సహఉద్యోగులు.. ఆఫీస్ పాలిటిక్స్‌పై సలహాలు కోరిన మేనేజర్
Reading Time: 2 minutes

ప్రమోషన్‌తో శత్రువులుగా మారిన సహఉద్యోగులు.. ఆఫీస్ పాలిటిక్స్‌పై సలహాలు కోరిన మేనేజర్

Caption of Image.

కష్టపడి పనిచేసినందుకు వచ్చిన ప్రమోషన్ సాధారణంగా ప్రతి ఉద్యోగికి కలలా ఉంటుంది. కానీ ఓ ఉద్యోగి విషయంలో అదే ప్రమోషన్ కొత్త సమస్యలకు కారణమైంది. వేగంగా మేనేజర్ స్థాయికి ఎదిగిన ఆ ఉద్యోగి, కొత్త బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే సహచరుల నుంచి వ్యతిరేకత, సరైన ట్రైనింగ్ లేకపోవడం, అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆనందంగా మొదలైన కొత్త ప్రయాణం క్రమంగా మానసిక ఒత్తిడిగా మారిందని చెప్పాడు.

ఉద్యోగి తనను మరో బ్రాంచ్‌లో ఒక షిఫ్ట్ నిర్వహణ బాధ్యతకు ప్రమోట్ చేశారని రెడ్డిట్ పోస్టులో వివరించాడు. అయితే కొత్త బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన పూర్తి శిక్షణ ఇవ్వలేదని ఆరోపించాడు. సీనియర్ ఉద్యోగి కేవలం 5 నిమిషాల చిన్న చిన్న సెషన్లతో సరిపెట్టాడని, తాను నేర్చుకునే సమయంలో కొంతమంది సహచరులు నవ్వుకున్నారని తెలిపాడు. బ్రాంచ్ విధానాలు, సాఫ్ట్‌వేర్, రోజువారీ పనులపై సరైన అవగాహన కల్పించలేదని వెల్లడించాడు.

ప్రమోషన్‌పై అసంతృప్తి.. సహచరుల నుంచి వ్యతిరేకత?
తన కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు ప్రమోషన్ దక్కకపోవడంతో అసహనం చూపిస్తున్నారని ఆ వ్యక్తి భావించాడు. కొందరు కావాలనే సహకరించడం లేదని, ఒకరు స్పష్టత లేని విమర్శలు చేశారని, మరొకరు తాను తీసుకున్న నిర్ణయాలను మార్చి వేస్తున్నారని ఆరోపించాడు. చివరకు తనకు సరైన శిక్షణ ఇవ్వలేదనే విషయాన్ని ఇతరుల ముందు ప్రస్తావించడం తనను మరింత ఇబ్బందికి గురిచేసిందని చెప్పాడు.

అయితే పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ తాను కూల్ గా వ్యవహరించానని, పనితీరును కొనసాగించానని ఉద్యోగి తెలిపాడు. తనకు వచ్చిన ఈమెయిల్స్, మెసేజ్‌లు, చాట్స్ భద్రపరుచుకుంటున్నానని చెప్పాడు. భవిష్యత్తులో తన పాత్రను రక్షించుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో రెడ్డిట్ యూజర్లను సలహా కోరాడు.

ALSO READ : ఇథనాల్ కలిపితే పెట్రోల్ ధరలు తగ్గవు

ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త మేనేజర్లు తమను దాటి ఎదిగిన ఉద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలని.. వారికి కూడా ఎదగడానికి మార్గాలు చూపించాలని సూచించారు. మరికొందరు సరైన ఆన్‌బోర్డింగ్, స్పష్టమైన శిక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. వేగంగా వచ్చిన ప్రమోషన్ విజయానికి సంకేతమే అయినా.. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు సరైన సపోర్ట్, టీమ్ నమ్మకం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి సూచిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.