July 19, 2026

Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..

Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
Reading Time: < 1 minute
Bihar Constable Babli Kumari Bpsc Dsp Success Story

మనుషుల కలలు కేవలం స్కూల్ పుస్తకాల నుంచే కాకుండా, జీవితంలోని కష్టాల నుంచి కూడా పుట్టుకొస్తాయని నిరూపించారు బిహార్‌కు చెందిన బబ్లీ కుమారి. బోధ్‌గయలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బబ్లీ, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను చూస్తూ పెరిగారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన ఆమె, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2013 లో పెళ్లయినప్పటికీ, కుటుంబానికి ఆర్థిక ఆసరా అందించాలనే పట్టుదలతో 2015 లో బిహార్ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. సాధారణంగా ఉద్యోగం వస్తే చాలామంది అక్కడితో సరిపెట్టుకుంటారు, కానీ బబ్లీ ఆశయం అంతటితో ఆగలేదు.

ఆమె బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్ష రాసి ఒక ఉన్నతాధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పోలీస్ శాఖలో 20 గంటల కఠినమైన డ్యూటీలు చేస్తూ చదవడం అంత సులువు కాలేదు. విధి నిర్వహణలో దొరికిన కొద్దిపాటి సమయాన్ని కూడా ఆమె పుస్తకాలతో గడిపేవారు. ఈ ప్రయాణంలో అత్యంత కఠినమైన ఘట్టం ఏమిటంటే, ఆమె బీపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో గర్భవతిగా ఉన్నారు. ఒకవైపు డ్యూటీ, మరోవైపు ఆరోగ్యం, ఇంకోవైపు పరీక్షల సిలబస్ ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. చదువు కోసం తగిన సమయం దొరకకపోవడంతో, సెలవు పెట్టి పాట్నా వెళ్లి తీవ్రంగా శ్రమించారు.

ఈ ప్రస్థానంలో బబ్లీ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా తన తప్పులను సరిదిద్దుకుని, మూడోసారి మరింత పట్టుదలతో పరీక్ష రాశారు. 2022 లో విడుదలైన 66వ బీపీఎస్‌సీ ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా 208వ ర్యాంక్ సాధించి, నేరుగా డీఎస్‌పీ (DSP) స్థాయి అధికారిణిగా ఎంపికయ్యారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి కఠినమైన డ్యూటీ, గర్భధారణ సమయం, వరుస వైఫల్యాలను తట్టుకుని నిలబడిన బబ్లీ కుమారి కథ ఎందరో మహిళలకు ఆదర్శప్రాయం. తన విజయానికి భర్త, అత్తమామల ప్రోత్సాహమే కారణమని ఆమె గర్వంగా చెబుతారు.