
న్యూఢిల్లీ: అజిత్ దోవల్.. ఈ పేరు వినగానే జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్, సూపర్ స్పే అనే మాటలు వినిపిస్తాయి. భారత ఇంటలిజెన్స్ రంగంలో ఆయనది ప్రత్యేక స్థానం. 20 ఏండ్లకే గూఢచారిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో క్లిష్ట సమయాల్లో దేశానికి అండగా నిలిచారు. అలాంటి అజిత్ దోవల్ కూడా తన కెరీర్ తొలినాళ్లలో ఓ ఇబ్బందికర ఘటన ఎదుర్కొన్నారు. ఆ ఘటనతో తన కెరీరే క్లోజ్ అయిపోయిందని ఆయన భయపడ్డారంట. ఈ విషయాన్ని స్వయంగా అజిత్ దోవలే వెల్లడించారు.
శనివారం (సెప్టెంబర్ 19) ఐఐటి రూర్కీ స్నాతకోత్సవ వేడుక జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్ స్టార్టింగ్‌లో జరిగిన ఓ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేశారు. ‘‘20 ఏళ్ల వయసులో స్పైగా కెరీర్ ప్రారంభించా. కెరీర్ స్టార్టింగ్‌లో సిక్కింలో ఇంటెలిజెన్స్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. సిక్కిం అప్పటికీ భారతదేశంలో భాగంగా లేదు. ఇండియాలో విలీనంపై చర్చలు జరగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచడం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కదలికలు, కార్యకలాపాల గురించి సమాచారం సేకరించడం నా పని.
ఒక మిషన్‌లో భాగంగా సమాచార సేకరణ కోసం సరిహద్దు ప్రాంతానికి నా టీమ్‌ను పంపించా. ప్లాన్‌లో భాగంగా వారు వారం రోజుల్లో తిరిగి రావాలి. కానీ 15 రోజులు గడిచిన నా టీమ్ వెనక్కి రాలేదు. వారి ఆచూకీ కూడా తెలియలేదు. ప్రతికూల వాతావరణం పరిస్థితులు, హిమాపాతం వల్ల వారు ప్రాణాలతో ఉన్నారా లేదా.. అసలు ఏమైంది అనే ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో హెడ్ ఆఫీస్ తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా టీమ్ సరిహద్దు దాటి చైనా సైన్యానికి దొరికిపోయినట్లు తెలిసింది.
సుదీర్ఘ విచారణ, తీవ్ర ఒత్తిళ్ల అనంతరం దౌత్యపరమైన సంప్రదింపులతో చైనా నా టీమ్ సభ్యులను రిలీజ్ చేసింది. నా టీమ్ మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన స్థితిలో తిరిగి ఇండియా తిరిగి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో నా కెరీర్ క్లోజ్ అయ్యిందనుకున్నా. అయితే అధికారిక విచారణలో హెడ్ ఆఫీస్ నుంచి తమకు అందిన మ్యాపులు, రూట్ స్కెచ్లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది. తప్పుడు మ్యాపుల కారణంగానే తమ ఏజెంట్లు దారి తప్పి చైనా భూభాగంలోకి ప్రవేశించారని నిర్ధారణ కావడంతో తనకు క్లీన్ చిట్ లభించింది. ఈ ఘటనతో తాను తీవ్ర ఆందోళనకు, అధైర్యానికి గురయ్యా.
ఆ క్లిష్ట సమయంలో తీవ్ర నైరాశ్యంలో ఉన్న తనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఓ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ కొన్ని మాటలు చెప్పాడు. జీవితం కూడా ఒక మ్యాప్ లాంటిదే.. కొందరు సరిగ్గా చదువుతారు, కొందరు తప్పుగా చదువుతారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం..? ఎక్కడికి వెళ్లాలి..? అక్కడికి ఎలా చేరుకోవాలి..? అనే ఈ మూడు విషయాలపై స్పష్టత ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని ఆయన దిశానిర్ధేశం చేశారు. ఆయన మాటలు నైరాశ్యంలో ఉన్న తనలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి’’ అని అజిత్ దోవల్ తన కెరీర్ లోని ఆసక్తికర విషయాన్ని బహిరంగపరిచారు.