Reading Time: 2 minutes
Suryakumar Yadav Reacts To Shreyas Iyer Becoming India T20 Captain A Proud Moment For Mumbai Cricket

Suryakumar Yadav’s First Reaction After Losing India T20 Captaincy: భారత టీ20 జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్న రోజే.. ముంబై లీగ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ శనివారం (జూన్ 6) ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే సూర్యకుమార్, శ్రేయస్ ఇద్దరూ ముంబై టీ20 లీగ్‌లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ట్రయంఫ్ నైట్స్ ఎంఎన్‌ఈ తరఫున సూర్య బరిలోకి దిగగా.. సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున సర్పంచ్ సాబ్ ఆడాడు.

శ్రేయస్ అద్భుత ప్రదర్శన:
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయంఫ్ నైట్స్ ఎంఎన్‌ఈ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. సూర్య ఇన్నింగ్స్‌తో జట్టు పోరాడే స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన చేశాడు. 36 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సర్పంచ్ సాబ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శ్రేయస్ చెలరేగడంతో సోబో ముంబై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం:
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇద్దరు స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్, శ్రేయస్ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెప్టెన్సీ మార్పులపై ఎలాంటి అసంతృప్తి బయటపెట్టకుండా సూర్య తన హుందాతనాన్ని చాటుకున్నాడు. టాస్ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రేయస్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. ‘శ్రేయస్‌కు భారత టీ20 జట్టు నాయకత్వం దక్కడం చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం ముంబై తరఫున ఎన్నో సంవత్సరాలు కలిసి క్రికెట్ ఆడాం. వరుసగా ముగ్గురు ముంబై కెప్టెన్లు భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించడం ముంబై క్రికెట్‌కు గర్వకారణం. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం’ అని సూర్య చెప్పాడు.

హుందాతనాన్ని కొనసాగిస్తూ:
2026 టీ20 ప్రపంచ కప్ గెలిపించిన మూడు నెలలకే సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాదు ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల జట్టులో కూడా సూరీడుకి చోటు కల్పించకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. అయినప్పటికీ సూర్య తన హుందాతనాన్ని కొనసాగిస్తూ.. కొత్త కెప్టెన్‌కు మద్దతు ప్రకటించడం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్‌కు ఇది కీలక బాధ్యత. ముంబై లీగ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన ఫామ్‌ను చాటిన అతడు.. ఇప్పుడు భారత టీ20 జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ ఎలాంటి విజయాలు సాధిస్తాడో, సూర్యకుమార్ మళ్లీ భారత జట్టులోకి ఎలా పునరాగమనం చేస్తాడో అనే అంశాలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.