Reading Time: 2 minutes
Mumbai Man Steals Mother Gold For Girlfriend Birthday

Gold Theft: ముంబైలో వెలుగు చూసిన ఒక వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన లవర్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడం కోసం, ఒక యువకుడు ఏకంగా కన్నతల్లి నగలనే చోరీ చేశాడు. లక్షల విలువైన ఆభరణాలను అమ్మేసి, ఆ డబ్బుతో ప్రియురాలికి ఖరీదైన గిఫ్ట్‌లు, షాపింగ్, గ్రాండ్ పార్టీలతో ఎంజాయ్ చేశాడు. అయితే క్లైమాక్స్‌లో మనోడి చేతికి పోలీసులు బేడీలు వేశారు. అసలు ఏం జరిగిందంటే…

ఇంట్లోనే మాయమైన నగలు
ముంబైకి చెందిన సదరు యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డేను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. కానీ, చేతిలో పైసా లేదు. దీంతో షార్ట్‌కట్ ఆలోచించి.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా కన్నతల్లికి సంబంధించిన లక్షల రూపాయల విలువైన బంగారు నగలను దొంగిలించాడు. వాటిని నమ్మకస్తులైన కొందరికి అమ్మేసి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకున్నాడు. ఆ డబ్బుతో ప్రియురాలికి ఖరీదైన బహుమతులు కొనడమే కాకుండా, స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చి మొత్తం డబ్బులు ఖర్చు చేశాడు.

పోలీసుల ఎంట్రీ.. గుట్టు రట్టు
కొన్ని రోజుల తర్వాత సదరు మహిళ నగలు తీసుకుందామని చూడగా అవి కనిపించలేదు. మొదట ఎక్కడైనా పెట్టి మర్చిపోయానేమోనని ఇల్లంతా వెతికింది. ఎంతకీ దొరక్కపోవడంతో ఆందోళనకు గురై, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసులు రంగంలోకి దిగి కేసు ఫైల్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. అయితే దర్యాప్తులో పోలీసులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా వచ్చినట్లు లేదా తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఈ దొంగతనం బయటి వ్యక్తుల పని కాదని తేలడంతో, పోలీసుల అనుమానం కుటుంబ సభ్యులపైకి మళ్లింది. అప్పుడు ఆ యువకుడిని పిలిచి తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన తప్పును ఒప్పుకున్నాడు. గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే కోసమే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. “కేవలం ఒక్క రోజు ఆడంబరం కోసం, ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం లక్షల రూపాయల తల్లి నగలను అమ్మేసి జల్సాలు చేశాడు” అని పోలీసులు తేల్చారు.

ప్రస్తుతం ఆ యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతను ఆ నగలను ఎవరెవరికి అమ్మాడు? ఆ నగలను కొనుగోలు చేసిన వ్యాపారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా, ఈ దొంగతనంలో అతనికి ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తూ, “ఇది ప్రేమ కాదు, పిచ్చితనం” అంటూ కామెంట్లు పెడుతున్నారు.