Reading Time: < 1 minute
Secunderabad Excise Task Force Busts Liquor Mixing Gang Chivas Regal Fake Liquor Racket

Hyderabad Liquor Scam: ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ టీం లిక్కర్ మిక్సింగ్ ముఠా గుట్టు రట్టు చేసింది. “మామూలు లిక్కర్ తాగితే ఏముంటుంది అన్నా.. ప్రీమియం బ్రాండెడ్ లిక్కర్ తాగితే మంచి కిక్ వస్తుందన్నా.. ప్రీమియర్ లిక్కర్ కూడా మనకు మామూలు లిక్కర్ ధరలోనే మనకు లభిస్తుంది.” అంటూ నమ్మ బలికి ప్రీమియం లిక్కర్‌లో సాధారణ లిక్కర్ కలిపి ఫంక్షన్లలోనూ తెలిసినా.. బడా బాబులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్న ఒక ముఠాను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ టీం సీఐ సావిత్రి సౌజన్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు..

లిక్కర్ మిక్సింగ్ జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య, టీం సిబ్బంది కలిసి రసూల్‌పుర మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద ఆరు చివాస్ రీగల్ (Chivas Regal) లిక్కర్ బాటిల్ లభించాయి. వాటిని పరిశీలించగా ప్రీమియం లిక్కర్ బాటిల్‌లో తక్కువ ధర కలిగిన మద్యం మిక్సింగ్ చేసినట్లుగా ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై నిందితులను ప్రశ్నించినప్పుడు.. అసలు విషయం వెల్లడించారు. దీంతో మిక్సింగ్ లిక్కర్ తయారీ ప్రాంతానికి నిందితులతో కలిసి టీమ్ సభ్యులు వెళ్లారు. లిక్కర్ మిక్సింగ్ ప్రాంతంలో 41 చివాస్ రీగల్ (Chivas Regal) ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. అంతేకాదు.. మిక్సింగ్ మద్యం నింపడానికి సిద్ధం చేసిన వివిధ రకాలైన హై క్వాలిటీ ప్రీమియం లిక్కర్ బాటిల్స్ 63 లభించాయి. చివరకు రూ. 25 వేల విలువ కలిగిన రాయల్ సెల్యూట్ లాంటి మద్యం బాటిల్‌ని సైతం ఈ ముఠా మిక్సింగ్ మద్యంతో నింపి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు ఎక్సైజ్ విచారణలో వెల్లడైంది. మిక్సింగ్ లిక్కర్ దందా ముఠాలో చికున్ స్వాయిన్, సోను మహంతి, ప్రపుల్ కుమార్ నాయక్ ఉన్నట్లు సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. ఈ కేసులో చికున్ స్వాన్, సోను మహంతులను అరెస్ట్ చేశారు. ప్రపుల్ కుమార్ నాయక్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ పంచాక్షరి, ఏఈఎస్ శ్రీనివాసరావు తెలిపారు.