
వెండితెరపై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్యల కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. ఫ్యాన్స్ కు పూనకాలే. ‘మనం’ వంటి క్లాసిక్ నుంచి ‘బంగార్రాజు’ వంటి మాస్ ఎంటర్టైనర్ వరకు వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అయితే, లేటెస్ట్ గా వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతోందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరోసారి ‘బంగార్రాజు’ మ్యాజిక్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. తన తండ్రితో కలిసి నటించే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘బంగార్రాజు’ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని, త్వరలోనే తామిద్దరం కలిసి వెండితెరపై కనిపించబోతున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ‘మనం’, ‘ప్రేమమ్’ , ‘బంగార్రాజు’ సినిమాలతో మెప్పించిన ఈ తండ్రీకొడుకులు, ఇప్పుడు నాలుగోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఎంత సరదాగా ఉన్నా..
తండ్రితో కలిసి పనిచేయడంపై చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెట్స్‌పై తండ్రీకొడుకుల బంధం నుంచి నటీనటుల బంధంలోకి మారడం ఒక సవాలుతో కూడిన విషయం. ఆయన కేవలం నా తండ్రి మాత్రమే కాదు, నిర్మాత కూడా. అందుకే మా మధ్య చాలా క్రియేటివ్ చర్చలు జరుగుతుంటాయి. ఎంత సరదాగా ఉన్నా, చివరి నిర్ణయం మాత్రం ఆయనకే వదిలేస్తాను అని చైతూ చెప్పుకొచ్చారు.
నాగ్ 100వ సినిమాలో చై, అఖిల్?
మరోవైపు నాగార్జున తన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీ అయిన 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నాగచైతన్యతో పాటు అఖిల్ అక్కినేని కూడా మెరుపు తీగలా మెరవనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, ముగ్గురు అక్కినేని హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఆశపడే అభిమానుల కల నెరవేరుతుంది.
చైతూ చేతిలో క్రేజీ ప్రాజెక్టు..
కేవలం తండ్రితో చేసే సినిమాలే కాకుండా, నాగచైతన్య సోలోగానూ ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నటించనున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా డార్క్ థీమ్‌తో సాగనుంది. అక్కినేని వారసులు వెండితెరపై తండ్రికి తగ్గ తనయులుగా దూసుకుపోతూనే, అప్పుడప్పుడు నాన్నతో కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.