Reading Time: < 1 minute
Komatireddy Rajagopal Reddy Slams Kalvakuntla Kavitha Big Joke Remarks Spark Political Row

MLA Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలపై స్పందిస్తూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ ఏర్పాటు విషయాన్ని రాజగోపాల్ రెడ్డి “బిగ్ జోక్”గా అభివర్ణించారు. అదే విధంగా TRS పేరుతో పార్టీ పెట్టడం మరో జోక్ అని వ్యాఖ్యానించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడు బిడ్డగా మాత్రమేనని, ఆమె స్వతంత్ర రాజకీయ నాయకత్వం ఇంకా నిరూపించుకోలేదని అన్నారు.

మొదటి సమావేశంలోనే తన తండ్రి అయిన కేసీఆర్‌ను విమర్శించడం సరైంది కాదని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తండ్రిపై గౌరవం, ప్రేమ ఉండాలని, అలాంటి విలువలు లేకపోతే ఆమె వ్యక్తిత్వం ప్రశ్నార్థకమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. “తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది” అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అలాగే కవిత అన్నపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపడం సరికాదని అన్నారు. కుటుంబ సమస్యలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు. కవితపై ఉన్న మద్యం కుంభకోణం ఆరోపణల విషయమై.. ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, నిర్దోషి అని తేలలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం డబ్బులు ఉన్నాయనే కారణంతో పార్టీ పెట్టడం అంత సులువు కాదని, అది పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు.

తనంతట తాను పోటీ చేసినా కవితకు డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, అధిష్టానం తనకు పెద్ద పదవి ఇస్తే ఆ బాధ్యతను న్యాయంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.