Reading Time: < 1 minute

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లే.. డీఎంకేకు మద్దతు ఇస్తం: కమల్ హాసన్ కీలక ప్రకటన

Caption of Image.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మక్కల్ నీది మైయం చీఫ్, రాజ్య సభ ఎంపీ కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన మక్కల్ నీది మైయం పార్టీ పోటీ చేయదని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. 

మంగళవారం (మార్చి 24) డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్‎తో కమల్ హాసన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం.. ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకేకు మద్దతు ఇవ్వాలని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. కాగా, డీఎంకే కూటమి మద్దతుతో కమల్ హాసన్ రాజ్య సభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

యాక్టర్ టూ పొలిటిషియన్:

అవినీతి, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి లక్ష్యాలతో ప్రముఖ నటుడు కమల్ హాసన్ 2017లో మక్కల్ నీది మైయం పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఎంఎన్ఎం పోటీ చేసి మొత్తం ఓట్లలో సుమారు నాలుగు శాతం వాటాను సాధించి తమిళ రాజకీయాల్లో ఉనికి చాటుకుంది. 

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎంఎన్ఎం బరిలోకి దిగింది. ఆ పార్టీ చీఫ్ కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఎంఎన్ఎం దూరంగా ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026:

మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 2026, ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 

►ALSO READ | మాకు ఓటేస్తే ఫ్రిడ్జ్ ఫ్రీ.. అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. 297 హామీల కుండపోత !

©️ VIL Media Pvt Ltd.