
టి20 ప్రపంచకప్ సూపర్8 గ్రూప్1లో సౌతాఫ్రికా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. సఫారీ గెలుపు టీమిండియాకు అతి పెద్ద ఊరటగా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను హోల్డర్, షెఫర్డ్ ఆదుకున్నారు. ఇద్దరు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోల్డర్ 31 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 49పరుగులు చేశాడు.
ధాటిగా ఆడిన రొమారియో షెఫర్డ్ 37బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఎంగిడి మూడు, బోస్చ్, రబడా రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, ఐడెన్ మార్‌క్రమ్ జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన డికాక్ 24 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 4 బౌండరీలతో 47 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 48 బంతుల్లోనే 95 పరుగులు జోడించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన మార్‌క్రమ్ 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. అతనికి రియాన్ రికెల్టన్ 45 (నాటౌట్) అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు అభేద్యంగా 82 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.