
అలనాడు ఓ వ్యాపార సంస్థగా వెలిసి, ఆనక భారతదేశంలో పాలనా పగ్గాల దశకు చేరిన వైభవ ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడింది. ఈ విధంగా ఈ కంపెనీ మూసుకోవడం చరిత్రలో ఇది రెండోసారి అయింది. ఒకనాడు శక్తివంతమైన బ్రిటిష్ వ్యాపార సంస్థగా ఉన్న కంపెనీ దారుణస్థితికి చేరింది. నిజానికి మునుపటి ఈ కంపెనీ దాదాపుగా 152 ఏండ్ల క్రితమే బోర్డు తిప్పేసింది. అయితే దీనిపై ఉన్న ఆసక్తితో 2010లో బ్రిటిష్ ఇండియన్ వ్యాపారవేత్త కంపెనీ హక్కులు కొన్నారు. 1857లో ఈ కంపెనీ భారతీయ పగ్గాలను భారతీయ తిరుగుబాటు క్రమంలో బ్రిటన్ రాజరిక ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. అప్పటి నుంచి భారతదేశంలో బ్రిటిష్ రాజరిక వ్యవస్థ ఏర్పాటు అయింది. ఈస్ట్ ఇండియా హయాంలో భారత్‌కు అనేక కష్టాలు ఎదురయ్యాయి.
ప్రపంచ వాణిజ్య వ్యవస్థను మలుపు తిప్పిన ఈ కంపెనీ భారత్‌లో తన దమననీతితో ప్రజలను వేధించుకుతింది. అప్పట్లో ఈ కంపెనీ దోపిడి హయాంలో దారుణ రీతిలో బెంగాల్ కరువు ఏర్పడింది. మూడు కోట్ల మంది వరకూ ఆకలిదప్పులతో మృతి చెందారు. భారతీయ సంతతికి చెందిన సంజీవ్ మెహతా ఈ కంపెనీ హక్కులను ఈ కంపెనీ కర్కశత్వానికి ప్రతీకారంగా తీసుకున్నాడు . పలు ఆర్థిక కారణాలతో ఈ అపఖ్యాతి పేరున్న కంపెనీ చివరికి స్టాల్స్, ఇతర చిన్న వ్యాపారాల షోరూంలతో సాగి మూత పడిందని, కోట్లాది రూపాయిలలో నష్టాలు అప్పుల ఊబితో మూసివేశారని లండన్ పత్రికలు రాశాయి. అయితే తాను ఈస్ట్ ఇండియా కంపెనీపై పగ తీర్చుకున్నానని తరచూ సంజీవ్ మెహతా మీసం వేలేసేవాడు. బోర్డు తిప్పినా, తన పూర్వపు భారతీయ పౌరుషం మిగిలిందని ప్రకటించాడు.