July 24, 2026

Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!

Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
Reading Time: < 1 minute
Covid India Central Health Ministry Update

దేశంలో కోవిడ్-19 వ్యాప్తిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. కోవిడ్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు తెలిపింది. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం అందించింది.

దేశంలో కోవిడ్ కేసులు, వైరస్ వ్యాప్తి, వేరియంట్స్‌ తదితర అంశాలపై ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), సీఎంసీ వెల్లూరు (CMC Vellore) తదితర సంస్థలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. వర్షాకాలంలో అన్నిరకాల వైరల్ ఫ్లూ కేసులు పెరగడం సహజమేనని, అందులో కోవిడ్ కూడా భాగమేనని పేర్కొన్నారు. ఐసీఎంఆర్, ఐడీఎస్‌పీ, సీఎంసీ వేలూరు శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు, విశ్లేషణల ప్రకారం ప్రస్తుతం నమోదవుతున్న కేసుల పెరుగుదల స్వల్పంగా ఉండే సీజనల్ ట్రెండ్ మాత్రమేనని, గత ఏడాది ఇదే సమయంలో నమోదైన పరిస్థితికి అనుగుణంగానే ఉందని కేంద్రం పేర్కొంది.

అలాగే, కోవిడ్ తీవ్రత పెరిగినట్లు గానీ, ప్రజలను ఆందోళనకు గురిచేసే కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చినట్లు గానీ ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో కూడా పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపింది.

ప్రస్తుతం అదనపు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. అయితే, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డిసీజ్ సర్వైలెన్స్ ఎప్పటిలాగే కొనసాగించాలని సూచించింది.

దేశవ్యాప్తంగా జీనోమిక్ సర్వైలెన్స్‌తో పాటు రాష్ట్రాల వారీగా కోవిడ్ పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించింది.