విద్యార్థులకు మేమున్నాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నీట్ 2026 పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని ఆయన కోరారు. గురువారం (జులై 23) రాత్రి ఢిల్లీలోని తీస్ జనవరి మార్గ్‌లో ఉన్న గాంధీ స్మృతిని రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు సందర్శించారు.
నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. సీజేపీ చలో పార్లమెంట్ సందర్భంగా నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా పోరాడుతోన్న సీజేపీ ఆందోళనకారులు, విద్యార్థులకు ప్రతిపక్షం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని చంపేయాలని బీజేపీ ప్రయత్నం:
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. విద్యార్థుల డిమాండ్లు అంగీకరించకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రజాస్వామ్య హత్యకు గురవుతోందని అన్నారు. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని, దేశ విద్యార్థుల భవిష్యత్తును హత్య చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.