Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిరీక్షించే భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు త్వరగా, సులభంగా అందించేందుకు ‘ఫుడ్ సర్వింగ్ కన్వేయర్’ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అల్పాహారం, మజ్జిగ, పాలు, పులిహోర వంటి అన్నప్రసాదాలు అందజేస్తుంటారు. ఇప్పుడు ఈ సేవలను మరింత వేగవంతం చేసేందుకు దాతల సహాయంతో సుమారు రూ. 3.50 లక్షల వ్యయంతో ఫుడ్ సర్వింగ్ కన్వేయర్‌ను రూపొందించారు. ప్రస్తుతం శిలాతోరణం సమీపంలోని 45వ గేటు వద్ద ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకులు దీనిని నడుపుతున్నారు. నిత్యం లక్షకు పైగా అన్నప్రసాద పోర్షన్లను భక్తులకు పంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, క్యూలైన్లలో భక్తులు ఎక్కువగా వేచి ఉండే మరిన్ని ప్రాంతాల్లో ఈ కన్వేయర్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Marriage Bureau: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్.. పిల్లను వెతకని మ్యారేజ్ బ్యూరోకు జుర్మానా