బంధువుల్లో మెప్పు కోసం పెళ్లికి 20 లక్షలు తగలేసి తప్పు చేశా: బెంగళూరు CA పోస్ట్ వైరల్

మన దేశంలో పెళ్లంటే.. ‘‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’’ అనే స్థాయిలో స్థోమతకు మించి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలై మరీ పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. జీవితంలో మళ్లీ మళ్లీ జరిగే ముచ్చట కాదని, ఒక్కసారి మాత్రమే ఆస్వాదించగలిగే మధుర క్షణాలని.. ఇలా ఎవరికి తోచిన సమర్థనలతో వాళ్లు ఖర్చు విషయంలో వెనకాడకుండా పెళ్లి చేసుకుంటారు.
ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం కోసం విలాసవంతమైన పెళ్లిళ్లు చేసుకుంటున్న జంటలూ లేకపోలేదు. కానీ.. పెళ్లికి అంతంత ఖర్చు పెట్టి.. బంధువులను పిలిచి.. 20 రకాల వెరైటీలతో భోజనాలు పెట్టి చేసుకుని.. బంధువుల్లో మెప్పు కోసం లక్షలకు లక్షలు తగలేయొద్దని ఈ తరహాలోనే పెళ్లి చేసుకున్న బెంగళూరుకు చెందిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ తన స్వీయ అనుభవాన్ని పంచుకుంది.
పెళ్లి అనేది వేడుకనే గానీ ఆర్థిక భారంగా మారకూడదని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి జ్ఞాపకాలను పోగేసుకునే ముచ్చటగా జరగాలని.. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ఆర్థిక ఒత్తిడితో మొదలుపెట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆమె హిత బోధ చేసింది.
20 లక్షలతో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి మన బ్యాంకు అకౌంట్ చూసుకునేంత వరకూ మర్చిపోలేని వేడుకగానే ఉంటుందని ఆమె చెప్పారు. బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకున్నాకే జ్ఞానోదయం అవుతుందని ఆమె చెప్పారు. 20 లక్షలతో తాము చేసుకున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్కు దేనికి ఎంత ఖర్చు చేశారో ఆమె వివరించారు.
సదరు సీఏ మీనల్ గోయల్ పెళ్లి ఖర్చు:
* పెళ్లి భోజనాలకు ఆరు లక్షలు
* పెళ్లి వేదికకు 5 లక్షలు
* డెకరేషన్కు 3 లక్షలు
* ఫొటోగ్రఫీకి 2 లక్షలు
* ఎంటర్టైన్ మెంట్కు 2 లక్షలు
* కంటికి కానరాని ఖర్చుల మరో 2 లక్షలు
48 గంటల్లో..
* పెళ్లి వేదికకు, మనకూ ఎలాంటి సంబంధం లేదు
* భోజనాలు ఏం మిగల్లేదు
* డెకరేషన్స్ మొత్తం తీసేస్తారు
* పెళ్లికి వచ్చిన అతిథులు మరో పెళ్లికి వెళ్లిపోతారు
కానీ.. ఒకటి మాత్రం మనతోనే ఉంటుంది:
* ఆర్థిక భారం
పెళ్లికి 20 లక్షలు ఖర్చు పెట్టేందుకు బదులుగా ఇలా చేసి ఉంటే:
* ఇంటికి డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు
* ఎమర్జెన్సీ ఫండ్గా కొంత పక్కన పెట్టొచ్చు
* లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్గా వాడుకోవచ్చు
* పుట్టబోయే పిల్లల ఎడ్యుకేషన్కు సమకూర్చుకోవచ్చు
* కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించవచ్చు
ఫైనల్గా బెంగళూరుకు చెందిన ఈ చార్టడ్ అకౌంటెంట్ (CA) చెప్పిందేంంటే.. పెళ్లి వేడుక కావొచ్చు గానీ ఆర్థిక భారంగా మారకూడదు.