July 23, 2026

IND vs ZIM 1st T20: వైభవ్‌ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?

IND vs ZIM 1st T20: వైభవ్‌ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
Reading Time: 2 minutes
India Vs Zimbabwe 1st T20 Will Vaibhav Sooryavanshi Be Dropped Prabhsimran Singh In Selection Race

India Playing XI vs Zimbabwe 1st T20: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు హరారే వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీమిండియా.. ఈ సిరీస్‌తో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఇది కీలక సిరీస్‌గా మారింది. అయితే తొలి టీ20 కోసం తుది జట్టును ఎంపిక చేయడం భారత జట్టు యాజమాన్యానికి పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ విషయంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది.

వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలం:

15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. దాంతో అతడికి మరో అవకాశం దక్కుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు వైభవ్‌ను పక్కనపెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్.. జింబాబ్వేపై అతడిని మళ్లీ బరిలోకి దింపనుంది. అయితే ఓపెనర్ స్థానానికి పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా పోటీలో ఉఉన్నాడు. వైభవ్ మాదిరే ప్రభ్‌సిమ్రన్ కూడా దూకుడుగా ఆడుతాడు. ఐపీఎల్ 2026లో అతడు పరుగుల వర్షం కురిపించిన నేపథ్యంలో ఓపెనింగ్ జోడిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.

కొత్త ఓపెనింగ్ జోడీని ట్రై చేయాలనుకుంటే:

ప్రభ్‌సిమ్రన్ సింగ్ చాలా కాలంగా భారత జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉండటంతో.. ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగా ప్రభ్‌సిమ్రన్‌కు జింబాబ్వేపై అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకే ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేసే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ అభిషేక్ శర్మతో కొత్త ఓపెనింగ్ జోడీని ట్రై చేయాలనుకుంటే.. బుడ్డోడికి షాక్ తప్పదు. ఇలా జరగడానికి కేవలం 1 శాతం మాత్రమే ఛాన్స్ ఉంది.

రవి బిష్ణోయ్, హర్ష్ దూబేల మధ్య పోటీ:

వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో తిలక్ వర్మ, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో స్థానంలో రింకూ సింగ్ బరిలోకి దిగనున్నారు. బౌలింగ్ విభాగంలో కూడా కొన్ని ఆసక్తికర నిర్ణయాలు ఉండనున్నాయి. స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్, హర్ష్ దూబేల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. దూబేకే తొలి మ్యాచ్‌లో అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. పేస్ విభాగంలో అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్‌లతో కూడిన త్రయం బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మయాంక్ యాదవ్ కూడా జట్టులో ఉన్నప్పటికీ.. తొలి మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తొలి టీ20కి భారత్ తుది జట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ/ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఇషాన్ కిషన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అశోక్ శర్మ/మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్.