Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!

Pachimirapakaya Pachadi: సాంప్రదాయ వంటకాల్లో ఆహా ఏమి రుచి అనిపించే వాటిలో “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” ఒకటి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకుని ఈ పచ్చడి నంజుకుని తింటే ఆ మజానే వేరు. కేవలం అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, రాగి సంగటి, గారెలతో కూడా ఇది అద్భుతంగా జోడీ కుదురుతుంది. సాధారణంగా చేసుకొనే విధంగా కాకుండా.. ఈ వంటకంలో ఇంగువ సువాసనతో ఒక రకం, అలాగే వెల్లుల్లి ఘాటుతో మరొక రకం అని రెండు విభిన్న రుచులలో పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
* పచ్చిమిరపకాయలు: ½ కేజీ
* చింతపండు: 30 గ్రా.
* నూనె: వేయించడానికి మరియు తిరగమాతకి సరిపడా
* ఉప్పు: రుచికి సరిపడా
* పసుపు: కొద్దిగా
* ఇంగువ:¼ చెంచా పొడి
* వెల్లుల్లి: ఒక రెబ్బ
తయారీ విధానం:
ముందుగా పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరికొద్దిగా నూనె వేసి ముందుగా ఇంగువ ముక్కను వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మధ్యలోకి విరిచి నూనెలో వేసి, మూత పెట్టి సన్నని మంట మీద సమానంగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి సగం మగ్గిన తర్వాత చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పచ్చిమిరపకాయలు పూర్తిగా మెత్తబడే వరకు వేగనిచ్చి పొయ్యి మీద నుంచి దించి చల్లారనివ్వాలి.
ఇంగువ పచ్చిమిరపకాయల పచ్చడి:
పచ్చడి కోసం రోట్లో ముందుగా వేయించిన ఇంగువ ముక్కను వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత వేయించి చల్లార్చుకున్న పచ్చిమిరపకాయల మిశ్రమంలో సగం భాగం మరియు చింతపండు వేసి రోకలితో మెత్తగా నూరుకోవాలి. రుచి చూసి అవసరమైతే మరికొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. పచ్చడి బాగా నలిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పోపులో సగం భాగం వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
వెల్లుల్లి పచ్చిమిరపకాయల పచ్చడి:
రెండవ రకం పచ్చడి తయారీ కోసం రోట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దానికి మిగిలిన సగం పచ్చిమిరపకాయలు, చింతపండు మిశ్రమాన్ని జత చేసి రోటిలో బాగా నూరుకోవాలి. పచ్చడి మెత్తగా నలిగిన తర్వాత మిగిలిన పోపును వేసి బాగా కలుపుకుని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి.
పచ్చడి తయారైన వెంటనే తినడం కంటే కనీసం అర గంట సేపు పక్కన ఉంచితే ఉప్పు, పులుపు, కారం బాగా పట్టి పచ్చడి మరింత రుచిగా తయారవుతుంది. ఈ రోటి పచ్చడి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచితే 2 రోజులు, ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే 4 రోజుల వరకు తాజా రుచితో నిల్వ ఉంటుంది.