డీజీపీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

హైదరాబాద్ లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. డీజీపీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేసింది. స్వామి అనే కానిస్టేబుల్ గురువారం (జులై 23) ఇంట్లో వాష్ రూమ్ లో రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు.
ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వాష్ రూమ్ లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు సంబంధించి స్వామి రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. తన కుటుంబ సభ్యులను ఏమీ అనవద్దని పేర్కొన్నాడు. చనిపోయి దయ్యం అయినా కూడా వాళ్లను మంచిగా చూసుకుంటాను అని రాశాడు.
తన కుటుంబ సభ్యులను ఏమీ అనవద్దని.. తన భార్య, పిల్లలు చాలా మంచి వాళ్లని పేర్కొన్నాడు. వాళ్లను ఎవరైనా వేధించినా.. హింసించినా దయ్యం అయి వదిలి పెట్టను అని నోట్ రాశాడు. ఏదైనా తప్పు చేసి ఉంటే అది తాను మాత్రమేనని.. తన భార్య పిల్లలకు ఏమీ తెలియదని లెటర్ లో పేర్కొన్నాడు. శిక్ష అనుభవించాల్సి ఉంటే అది తాను మాత్రమేని రాశాడు.
తన తల్లిదండ్రులను కూడా లెటర్ లో మెన్షన్ చేశాడు. తప్పు మీ అబ్బాయి మాత్రమే చేశాడు.. ఏదైనా అనాల్సి ఉంటే అది నన్నే.. నా భార్య, పిల్లలను కాదు.. వాళ్లను ఏమీ అనవద్దు అని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.
సక్రమంగా విధులకు హాజరవుతూ, సిన్సియర్ గా డ్యూటీ చేసే స్వామి సూసైడ్ డిపార్ట్ మెంట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుడు స్వామి స్వగ్రామం భువనగిరి జిల్లా చౌటుప్పల్. 2026 జులై 2 నుంచి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైఫాబాద్ పోలీసులు.