జంతర్ మంతర్ వద్ద మళ్లీ టెన్షన్.. సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్

- పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాల మోహరింపు
- పార్లమెంట్ వైపు వెళ్లే అన్ని దారులు మూసివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత మొదలైంది. అధికారుల అనుమతి లేకుండానే బుధవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో సెంట్రల్ ఢిల్లీలోని టాల్‌స్టాయ్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేశారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.
ప్రభుత్వంతో చర్చలకు రెడీ: సీజేపీ
ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీజేపీ పార్టీ ప్రకటించింది. అయితే, మంత్రుల నివాసాల్లో కాకుండా తటస్థ వేదికపైనే చర్చలు జరగాలని పట్టుబట్టింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన నివాసానికి వచ్చి చర్చలు జరపాలని ఆహ్వానించినట్లు పోలీసులు తమకు తెలిపారని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
అయితే, ఎవరి ఇళ్లకో, కార్యాలయాలకో వెళ్లేది లేదని తాము స్పష్టం చేసినట్లు చెప్పారు. “ప్రజల కోర్టు ఇక్కడే ఉంది. మంత్రులే ప్రజల ముందుకు రావాలి. చర్చలు జరగాలంటే అది జంతర్ మంతర్ లోనే జరగాలి” అని సౌరవ్ దాస్ తేల్చిచెప్పారు.