July 23, 2026

Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!

Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
Reading Time: < 1 minute
Hyderabad Dgp Office Constable Dies By Suicide With Service Weapon Police Begin Investigation

Constable Suicide: హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అందిన సమాచారం ప్రకారం.. నేడు (గురువారం) తెల్లవారుజామున సుమారు ఉదయం 5:30 గంటల సమయంలో డీజీపీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న సహచర పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా, ఆయన అప్పటికే మృతిచెందినట్లు సమాచారం.

ఘటన స్థలంలో పోలీసులు నిర్వహించిన పరిశీలనలో ఒక సూసైడ్ నోట్ లాభాయమైంది. ఆ నోట్‌లో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుపట్టవద్దని, వారు చాలా మంచివారని స్వామి పేర్కొన్నారు. అంతేకాకుండా, “నేను చనిపోయి దయ్యం అయినా కూడా నా భార్య, పిల్లలను చూసుకుంటాను” అంటూ భావోద్వేగపూరితంగా రాశారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.