July 23, 2026

US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్‌!

US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్‌!
Reading Time: < 1 minute
Us Deploys B1 Lancer Bomber Against Iran Gulf Tensions

US Airstrike: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వివాదం మొదలైన 12 రోజుల తర్వాత, అమెరికా సైన్యం తొలిసారిగా తన అత్యంత శక్తివంతమైన B-1 లాన్సర్ లాంగ్-రేంజ్ బాంబర్‌ను రంగంలోకి దించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లక్ష్యాలే ధ్యేయంగా ఈ బాంబర్ విరుచుకుపడింది. శబ్ద వేగాన్ని మించి పయనించే ఈ బీ-1 బాంబర్ దాదాపు రెండు డజన్ల 2,000 పౌండ్ల బాంబులను లేదా డజన్ల కొద్దీ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లగలదు. బ్రిటన్‌లోని ఎయిర్‌బేస్ నుంచి ఇది బయలుదేరినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిలో ఓడలకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సైనిక ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, లాజిస్టిక్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.

ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత ముదిరాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు ఆపకపోతే టెహ్రాన్‌లోని ప్రధాన వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా భాగస్వామ్య దేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, ఇరాన్ ప్రోద్బలంతో యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో దాడులు ప్రారంభించి, సౌదీ అరేబియా ఓడలపై దాడి చేశారు. దీంతో నౌకలు తమ మార్గాలను మళ్లించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఖతార్, ఒమాన్ దేశాల మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ కొత్త ప్రతిపాదనలను అంగీకరించకపోవడంతో ఇంకా ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే, తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఇరాన్ త్వరలోనే ఒప్పందానికి వస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.