July 23, 2026

Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంట‌ర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్‌, అలిస్టర్ కుక్!

Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంట‌ర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్‌, అలిస్టర్ కుక్!
Reading Time: 2 minutes
Dinesh Karthik Vs Alastair Cook Heated Debate Over Jacob Bethells Ipl Contract And England Duty

Dinesh Karthik Heated Discussion With Alastair Cook: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడిన ఇంగ్లండ్ యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ గురించి మరోసారి చర్చ మొదలైంది. 2026 సీజన్‌లో బెతెల్‌కు ప్లేయింగ్ 11లో ఎక్కువగా అవకాశాలు దక్కకపోవడంతో మాజీల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒకవైపు.. ఆర్‌సీబీ మెంటర్ దినేశ్ కార్తీక్, ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మో బొబాట్ మరోవైపు ఉండి తీవ్ర వాదనకు దిగారు. ఓ సమయంలో ఇంట‌ర్వ్యూలోనే కొట్టుకునేంత పని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వెళ్లిపోవడం కాంట్రాక్ట్‌ను అవమానించినట్లే:

ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు ఐపీఎల్ 2026 జరిగింది. ఐపీఎల్ ఆరంభంలో ఆర్‌సీబీలో ఆడుతున్న జాకబ్ బెతెల్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. దాంతో బెతెల్ స్వదేశానికి వెళ్లి టెస్టు సన్నాహకాలు చేసుకోవాలని ఇంగ్లండ్ మాజీలు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ సూచించారు. అదే అభిప్రాయాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో కుక్ మరోసారి సమర్థించాడు. కుక్ వ్యాఖ్యలపై దినేశ్ కార్తీక్ స్పందిస్తూ.. బెతెల్‌కు ఆర్‌సీబీతో మంచి ఒప్పందం ఉందని గుర్తు చేశాడు. ‘ఒక ఆటగాడు తుది జట్టులో అవకాశం రాలేదని టోర్నీ మధ్యలో వెళ్లిపోవడం కాంట్రాక్ట్‌ను అవమానించినట్లే. ఒకవేళ ప్రతి ఆటగాడు నన్ను ఆడించడం లేదు కాబట్టి ఇంటికి వెళ్తాను అని అనుకుంటే జట్టులో 11 మంది కూడా మిగలరు. వేలంలో పేరు నమోదు చేసే ముందే నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి’ అని డీకే కౌంటర్ ఇచ్చాడు.

ఆటగాళ్లతో గడపడం కూడా విలువైన అనుభవమే:

మో బొబాట్ కూడా కార్తీక్‌కు మద్దతుగా మాట్లాడాడు. ‘బెతెల్‌కు ఆర్‌సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఉండే అవకాశం దక్కింది. అలాంటి అనుభవం యువ ఆటగాడి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. మ్యాచ్‌లు ఆడకపోయినా అగ్రశ్రేణి ఆటగాళ్లతో గడపడం కూడా విలువైన అనుభవమే’ అని మో బొబాట్ అభిప్రాయపడ్డాడు. అయితే కుక్ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ‘బెతెల్ స్వదేశానికి వచ్చాక తొలి రెండు టెస్టుల్లో పరుగులు చేయలేదు. కానీ అతడు ఇంగ్లండ్‌కు కీలకమైన బ్యాటర్. అలాంటి ఆటగాడు బెంచ్‌పై కూర్చోవడం వల్ల ప్రయోజనం ఏముంది?. ఐపీఎల్ కంటే ఇంగ్లండ్ జట్టు విజయం ముఖ్యం. ఫ్రాంచైజీల పట్ల గౌరవం ఉంది కానీ.. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’ అని కుక్ మరోసారి ఘాటుగా స్పందించాడు.

బెంచ్‌పై కూర్చోవడం సరైన నిర్ణయమా?:

‘గత సీజన్‌లో కూడా బెతెల్ ఎక్కువగా బెంచ్‌పైనే ఉన్నాడు. ఈసారి కూడా అదే పరిస్థితి. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల నుంచి నేర్చుకోవడం మంచిదే కానీ.. మ్యాచ్‌లు ఆడకపోతే ఆ అనుభవం ఎంతవరకు ఉపయోగపడుతుంది?. ఇంగ్లండ్‌కు కీలకమైన ఆటగాడు మైదానంలో ఉండాల్సింది పోయి బెంచ్‌పై కూర్చోవడం సరైన నిర్ణయమా?’ అని డీకేను కుక్ ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యమా? లేదా ఫ్రాంచైజీ క్రికెట్‌కా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఏదేమైనా మాజీల మధ్య ఈ వాగ్వాదం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అయింది.