తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

- రాష్ట్రవ్యాప్తంగా వానలు
- మంగళ, బుధవారాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు
- నేడు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
- ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- క్రమంగా తగ్గుతున్న లోటు వర్షపాతం
- 34 నుంచి 24 శాతానికి తగ్గిన లోటు
హైదరాబాద్, వెలుగు: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం స్టార్ట్ అయిన వర్షాలు మంగళవారం రాత్రి, బుధవారం రాత్రివరకు పడ్డాయి. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లోనూ వానలు కవర్అయ్యాయి.
మంగళవారం రాత్రి రంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్గొండ, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్జిల్లా జైనద్, భారంపూర్లో 4.6 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా కోల్వాయిలో 4.4, భోరజ్‌లో 4.3, మంచిర్యాల జిల్లా తపాల్పూర్ 4.1, ఆదిలాబాద్ జిల్లా రామ్‌నగర్‌లో 4.1, తాంసిలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.ఇటు బుధవారం సాయంత్రం వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడ్డాయి.
వికారాబాద్ జిల్లా పెద్దుమంతల్, కొడంగల్‌లో 2.5 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా రామ్ నగర్లో 2.4, నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో 2.4, రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో 2.3, మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో 2.2, నిర్మల్ జిల్లా పాక్పాట్లలో 2.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ సిటీలో సాయంత్రం గంటపాటు మోస్తరు వాన పడింది. గచ్చిబౌలిలో 1.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రహ్మత్‌నగర్‌లో 1.6 సెంటీమీటర్లు, బోరబండలో 1.5, మైత్రివనంలో 1.4, మాదాపూర్‌లో 1.4, శ్రీనగర్‌కాలనీలో 1.3, మూసాపేటలో 1.3, జింఖానాలో 1.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, రాష్ట్రంలో గురువారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో దక్షిణ తెలంగాణల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఆ తర్వాత ఐదు రోజులు గాలులతోపాటు జల్లులుపడే చాన్స్ ఉందని పేర్కొంది.
తగ్గుతున్న లోటు
రాష్ట్రంలో పడుతున్న వర్షాలతో లోటు వర్షపాతం కవర్ అవుతున్నది. మొన్నటిదాకా 34 శాతం లోటు ఉండగా.. ఇప్పుడు 24 శాతానికి తగ్గింది. 288 మిల్లీమీటర్లకు గానూ 218 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీ లోటు ఉన్న వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ నిదానంగా లోటు తగ్గుతున్నది. 40 శాతానికిపైగా లోటు ఉన్న జిల్లాలు కేవలం ఐదే కావడం కొంచెం ఊరటనిచ్చే విషయం. 28 జిల్లాల్లోనూ 35 లోపే లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు ఇలాగే వారం రోజులు పడితే లోటు మరింత కవర్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యధికంగా 57 శాతం వర్షపాత లోటు ఉన్నది. హనుమకొండ జిల్లాలో 54 శాతం, వరంగల్‌లో 49 శాతం, యాదాద్రి భువనగిరిలో 46 శాతం, జనగామలో 45 శాతం చొప్పున వర్షపాతం తక్కువున్నది. మహబూబాబాద్, ఖమ్మం, నారాయణపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వికారాబాద్ జిల్లాల్లో 30 నుంచి 35 శాతం వరకు లోటుంది. నల్గొండ జిల్లాలో సాధారణానికి 2 శాతం ఎక్కువ వర్షం కురిసింది.