దేశంలో భారీగా తగ్గిన గోల్డ్ స్మగ్లింగ్.. వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు !

- 2025 నాటికి 646 కిలోలకు తగ్గిన స్మగ్లింగ్
- వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు
- నిరుడు మొత్తం 542 కిలోల సిల్వర్ స్మగ్లింగ్.. ఈ ఏడాది 3 నెలల్లోనే 586 కిలోలు
- పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: సూట్‌కేస్ ట్రాలీ రాడ్‌లో బంగారం.. నీళ్ల సీసాల్లో బంగారం.. ఒక్కటేంటి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ముఠాలు పన్నిన ఎత్తుగడలు అన్నీఇన్నీ కాదు. కానీ, ఇప్పుడు దేశంలో ఆ గోల్డ్ స్మగ్లింగ్ భారీగా తగ్గిపోయింది. మూడేండ్లలో దాదాపు 8 రెట్లు పడిపోయింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 4971.68 కిలోల బంగారాన్ని ముఠాలు అక్రమంగా రవాణా చేశాయి. అంటే దాదాపు 5 టన్నుల గోల్డ్స్మగ్లింగ్జరిగింది. 6599 కేసులు నమోదైతే.. 2003 మందిని కస్టమ్స్అధికారులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో 2025 నాటికి గోల్డ్ స్మగ్లింగ్ 646.66 కిలోలకు (6.5 క్వింటాళ్లు) తగ్గిపోయింది.
ఆ ఏడాది 836 కేసులు నమోదుకాగా.. 508 మందిని అరెస్ట్ చేశారు. అయితే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4.3 టన్నుల బంగారాన్ని అక్రమ రవాణా చేయగా.. 2023లో పెరగడం గమనార్హం. 2022లో 4619 కేసులు నమోదు చేస్తే.. 1740 మందిని అరెస్ట్ చేశారు. 2024–25లో 2.6 టన్నుల బంగారం అక్రమ రవాణా జరగ్గా.. 3005 కేసులు నమోదై 1240 మందిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఏడాది జూన్ వరకు మొత్తంగా 247 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేయగా.. కస్టమ్స్ అధికారులు 452 కేసులు నమోదు చేసి 183 మందిని అరెస్ట్ చేశారు.
వెండివైపు చూపు..
ఇటు వెండి అక్రమ రవాణా కూడా గతంతో పోలిస్తే 2025లో తగ్గినా.. ఈ ఏడాది ఇప్పటివరకు మాత్రం ఎక్కువైంది. 2022లో 784 కిలోల వెండి స్మగ్లింగ్ జరగ్గా 64 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో కేవలం ఒక్కరినే అరెస్ట్ చేశారు. 2023లో 984 కిలోల స్మగ్లింగ్జరగ్గా.. 50 కేసులు నమోదయ్యాయి. ఒక్కరిని అరెస్ట్ చేశారు. 2024లో వెండి స్మగ్లింగ్ భారీగా పెరిగింది. 2,505 కిలోల వెండిని అక్రమంగా తరలించగా.. కస్టమ్స్ అధికారులు 47 కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు.
2025లో మాత్రం స్మగ్లింగ్ చేసిన వెండి 542 కిలోలకు తగ్గగా.. 44 కేసులు పెట్టారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్వరకే 586 కిలోల వెండి స్మగ్లింగ్ జరిగింది. వాస్తవానికి గత ఆరు నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో చాలా మంది వెండివైపు చూస్తున్నారు. వ్యాపారులూ అడ్డదారుల్లో వెండిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది 23 కేసులు నమోదుచేయగా.. 10 మందిని అరెస్ట్ చేశారు.