July 23, 2026

Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..

Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
Reading Time: < 1 minute
Sadagoppan Ramesh Criticizes Bcci Rcb Players Snub India Zimbabwe T20 Series

జింబాబ్వేతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే భారత టీ20 జట్టును ఎంపిక చేస్తున్నారని, అయితే ఈ నిబంధన కొందరికే పరిమితం కావడం విచారకరమని ఆయన విమర్శించారు. వరుసగా 2025, 2026 సీజన్లలో ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నుంచి ఒక్క ఆటగాడిని కూడా సెలెక్ట్ చేయకపోవడాన్ని రమేష్ ప్రశ్నించారు.

ఐపీఎల్ 2026లో 28 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన అర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భువనేశ్వర్ వంటి సీనియర్ బౌలర్లను వదిలేసి, ఐపీఎల్ వికెట్ల జాబితాలో 47, 55, 89వ స్థానాల్లో ఉన్న హర్ష్ దూబే, అశోక్ శర్మ, యష్ ఠాకూర్ వంటి వారిని, అలాగే సరిగా మ్యాచ్‌లు ఆడని మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై మండిపడ్డారు.

అలాగే, ఐపీఎల్‌లో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని సూర్యాంష్ షెడ్గేను ఆల్‌రౌండర్‌గా ఎలా ఎంపిక చేస్తారని రమేష్ నిలదీశారు. ఐపీఎల్ రెండో అర్ధభాగంలో తమ ఫ్రాంచైజీ తుది జట్టులోనే చోటు దక్కించుకోలేకపోయిన రవి బిష్ణోయ్‌ను టీమిండియా జట్టులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే చోటు దక్కినప్పుడు, ఇతర అర్హులైన ఆటగాళ్ల పట్ల సెలెక్టర్లు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన పాపం ఏంటి..? ఇలా అయితే.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెలెక్టర్లు ఆర్సీబీపై చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.